-నూజివీడు మామిడి ఇమేజ్ మరింత పెరిగేలా నాణ్యమైన దిగుబడికి రైతులు కృషి చేయాలి
-రైతులు మామిడి నాణ్యత పెంచితే ఎయిర్ కార్గో సేవలు కూడా అందుబాటులోకి తెస్తాం-రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార -పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి
ఏలూరు/ నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
నూజివీడు మామిడి కి మరింత ఇమేజ్ చేకూర్చి రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు నూజివీడు మార్కెట్ యార్డును 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. స్థానిక మార్కెట్ యార్డులో బుధవారం మార్కెట్ యార్డులో మామిడి మార్కెట్ సౌకర్యాల ఏర్పాటుపై రైతులు, వ్యాపారస్తులు , అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ నూజివీడు మామిడికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని, కానీ ఇటీవల కాలంలో నాణ్యమైన మామిడి దిగుబడి రాకపోవడంతో రైతులు ఆర్థికంగా ఎంతగానో నష్టపోతున్నారన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, రైతాంగ సంక్షేమానికి సబ్సిడీతో కూడిన పధకాలను అందిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం విస్మరించిన మామిడి పంటకు భీమా పధకాన్ని త్వరలో అమలు చేస్తామని మంత్రి చెప్పారు. నూజివీడు మామిడి ఇమేజ్ మరింత పెంచేందుకు నాణ్యమైన మామిడి పంట కు రైతులు కృషి చేయాలనీ మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రి లోకేష్ యువగళం పాదయాత్రలో నూజివీడు ప్రాంతంలోని మామిడి రైతులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకురాగా, వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని, ఈ మేరకు మామిడి రైతుల సౌకర్యార్థం మార్కెట్ యార్డులో వివిధ మౌలిక సదుపాయాలను 30 కోట్ల రూపాయలతో ఏర్పాటుచేస్తున్నామని, వీటిని వినియోగించుకుని నాణ్యమైన మామిడి దిగుబడి అందించి నూజివీడు మామిడి ఇమేజ్ ను కాపాడుకోవలసిన బాధ్యత రైతులు, వ్యాపారులు, శాస్త్రవేత్తలపై ఉందన్నారు. నాణ్యమైన మామిడి దిగుబడికి తీసుకోవలసిన అవసరమైన చర్యలు, రైతులకు అవగాహన కలిగించేందుకు ఉద్యానవన, మార్కెటింగ్, మామిడి పరిశోధన శాస్త్రవేత్తలు, రైతులతో కలిసి కమిటీ నియమించి, మామిడి పంటకు అనుకూలమైన ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి నాణ్యమైన మామిడి దిగుబడికి భూసారం పెంచేలా తీసుకోవలసిన చర్యలు, నాణ్యమైన మామిడి ఉత్పత్తి విధానాలపై రైతులకు అవగాహన కలిగించి, నూజివీడు మామిడికి పూర్వవైభవం వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. మామిడి పరిశోధన సంస్థ శాస్త్రజ్ఞులు రైతులకు ఉపయోగపడేలా మరిన్ని సూచనలు చేయవలసిన అవసరం ఉందన్నారు. మామిడి రైతుల ఆర్థికాభివృద్ధికి, పంటకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తానని, నాణ్యమైన మామిడిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన “ఎయిర్ కార్గో” సేవలను కూడా రైతులకు అందుబాటులోకి తెస్తామన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పధకమునకు పర్యావరణ అనుమతులు రావలసి ఉందని, వాటిని సాధించి త్వరలోనే ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను, ఫుడ్ పార్క్ ను నూజివీడు ప్రాంతంలో ఏర్పాటుచేసి, నూజివీడు ప్రాంతానికి బంగారు భవిష్యత్తును అందిస్తామని మంత్రి పార్థసారథి చెప్పారు. రాష్ట్రంలోని 20 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతోపాటు, ప్రతీ ఇంటిలోనూ ఒక పారిశ్రామికవేత్తను రూపొందించేలా నూతర పారిశ్రామిక విధానాన్ని తీసుకువస్తామన్నారు.
వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీత మాట్లాడుతూ వేసవి వస్తుందంటే నూజివీడు మామిడి ఎప్పుడు వస్తుందా ప్రజలందరూ ఎదురుచూస్తూ ఉంటారని, నూజివీడు మామిడి కి క్రేజ్ అటువంటిదన్నారు. అటువంటి నూజివీడు మామిడి పంట నాణ్యతలో ఇటీవల కొంత తగ్గుదల వస్తున్నదన్నారు. నూజివీడు మామిడి పంటలో కార్బన్, రసాయనిక ఎరువుల వినియోగాన్ని నివారించి నాణ్యతను పెంచేలా రైతులలో అవగాహన పెంచుతామన్నారు. నూజివీడు మామిడి రైతుల కోసం మార్కెట్ యార్డులో 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ డైరెక్టర్ లావణ్యావేణి, ఈఈ శ్రీనివాసరావు, నూజివీడు ఆర్డీఓ ఎం. వాణి , ఉద్యానవన శాఖ అదనపు డైరెక్టర్ హరనాధరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ రామ్మోహన్, మామిడి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త సీతామహాలక్ష్మీ, ప్రభృతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, వ్యాపారాలు మార్కెట్ యార్డు లో మామిడి రైతులకు కల్పించిన సౌకర్యాలపై హర్షం వ్యక్తం చేశారు.