-ఆహ్వాన పత్రిక అందచేసిన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
-సాగర సంగమాన్ని ఎకో టూరిజం ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి
-పాత ఎడ్లంక బ్రిడ్జి నిర్మించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విజ్ఞప్తి
-డాక్టర్ కోట శ్రీహరిరావు హత్య కేసు దర్యాప్తుపై చర్చ
-ఎదురుమొండి- గొల్లమంద రోడ్డు మంజూరు పట్ల ధన్యవాదములు
-విస్తృత స్థాయిలో సీసీ రోడ్ల మంజూరు పట్ల ధన్యవాదములు తెలిపిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ – గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, పవన్ కళ్యాణ్ ని ఘనంగా సత్కరించారు. ఈ నెల 28, 29 తేదీల్లో విజయవాడలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు ఆయనను ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. ఈ మేరకు ఆయనకు ఆహ్వాన పత్రిక అందచేశారు. నియోజకవర్గంలోని కోడూరు మండలంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం సాగర సంగమాన్ని ఎకో టూరిజం ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. అవనిగడ్డ మండలంలోని ద్వీప గ్రామం పాత ఎడ్లంకకు కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణం ఆవశ్యకత గురించి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. వరదల సమయంలో రేవు దాటేందుకు గ్రామస్థులు, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు ఆయనకు వివరించారు.
అవనిగడ్డలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్య కేసు దర్యాప్తు గురించి ఆయనతో చర్చించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల ఫలితాలు ఆయనకు వివరించారు. నాగాయలంక మండలం ఎదురుమొండి దీవుల్లో ఎదురుమొండి- గొల్లమంద రోడ్డు మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో విస్తృత స్థాయిలో సీసీ రోడ్లు నిర్మించేందుకు నిధులు మంజూరు చేసిన సందర్భంగా ధన్యవాదములు తెలిపారు.