-క్లిష్టమైన హెర్నియా ఆపరేషన్ ద్వారా 38 సెం.మీ గడ్డ తొలగింపు
-రవి హాస్పిటల్ ఉచిత ఆపరేషన్ డ్రైవ్ లో విజయవంతంగా 30 శస్త్రచికిత్సలు
-100 ఆపరేషన్లు ఉచితంగా నిర్వహిస్తామని డాక్టర్ రవికాంత్ కొంగర వెల్లడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అత్యాధునిక వైద్య సేవలు అందరికీ అందించాలనే లక్ష్యంతో రవి ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఉచిత ఆపరేషన్ డ్రైవ్ విజయవంతంగా కొనసాగుతోంది. సూర్యారావుపేట స్వాతి ప్రెస్ సమీపంలోని రవి హాస్పిటల్లో ఇంతవరకు 30 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించడం విశేషం. రవి ఫౌండేషన్ ద్వారా మరో 70 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు రవి హాస్పిటల్ సీఈవో డాక్టర్ రవికాంత్ కొంగర తెలిపారు. హాస్పిటల్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రవి ఫౌండేషన్ సౌజన్యంతో హెర్నియా, గ్యాస్ట్రో, హిస్టరెక్టమీ, పసరు సంచి తదితర సమస్యలకు లాపరోస్కోపీ విధానంలో ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఒక అత్యంత క్లిష్టమైన హెర్నియా ఆపరేషన్ చేసినట్లు తెలిపారు. మైలవరం గ్రామానికి చెందిన విజయకుమారి (45) దాదాపు ఆరేళ్లుగా హెర్నియా సమస్యతో బాధపడుతోందని, 38 సెంటీమీటర్ల వైశాల్యంలో గడ్డ ఏర్పడటంతో సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కావడంతో చికిత్స తీసుకోలేక ఇబ్బందిపడుతున్న సదరు మహిళకు ఉచితంగా ఆపరేషన్ చేసి హెర్నియా గడ్డను విజయవంతంగా తొలగించినట్లు వివరించారు. అనుభవజ్ఞులైన గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు, గైనకాలజిస్టుల ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్సలను అందిస్తున్నామని తెలిపారు. ఉచిత వైద్య సేవల కోసం 8881838888, 8099353535 నంబర్లకు ఫోన్ చేసి ముందుగా నమోదు చేయించుకోవాలని డాక్టర్ రవికాంత్ కొంగర సూచించారు. రవి ఫౌండేషన్ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. విలేకరుల సమావేశంలో గైనకాలజిస్టు డాక్టర్ ఉదయ, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ శ్రీదేవి, అనస్థిషియాలజిస్ట్ డాక్టర్ చంద్ర పాల్గొన్నారు.