విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ చెప్పారు. శనివారం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కోవిడ్ మూడవ వేవ్ సన్నద్ధత పై నగరంలోని వైద్యాధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దేవాదాయశాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ కూడా కోవిడ్ కేసులను నియంత్రించేందుకు నిత్యం సమీక్షిస్తున్నారన్నారు. అలాగే పరిమితులు లేకుండా నిధులు, వైద్య సదుపాయాలు అన్నీ కల్పిస్తున్నారన్నారు. కేరళ రాష్ట్రంలో సుమారు 20 వేల కేసులు ప్రతి రోజు నమోదు అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర దేశాల్లో కూడా కేసులు అధికంగా వస్తున్నాయని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రస్తుతానికి 2000 కేసులే నమోదవుతున్నాయని, ఆ సంఖ్య తక్కువగానే ఉంది లేఅని అశ్రద్ధ, నిర్లక్ష్యం వహించవద్దని డాక్టర్లను కోరారు. నగరంలో చేపట్టిన ఫీవర్ సర్వేను వాలంటీర్లు, సచివాలయ అధికారులు కచ్చితంగా చేయమని ఆయన కోరారు. కోవిడ్ థర్డ్ వేవ్ నియంత్రణ కోసం జిల్లా కలెక్టర్ జె.నివాస్ తీసుకున్న చర్యలు సంతృప్తి కరంగా ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రికి అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పడానికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రాత్రి కర్ఫ్యూ పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ఆయన కోరారు. విజయవాడ నగరానికి అన్ని వైపుల నుంచి ప్రజలు రాకపోకలు జరుపుతుంటారని ఆయన చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకొని నగర ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ గతంలో నగరంలో 500 నుంచి 800 వరకే జరుగుతున్న కోవిడ్ నిర్ధారణ పరీక్షలు 2000 వేలకు పెంచాలన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే పరీక్షలు 6 వేల నుండి 9 వేలకు పెరగాలన్నారు. మున్సిపల్ కార్పొరేషన్‌కు అధనంగా 52 మంది డాక్టర్లను నియామకం జరిపామన్నారు. ఆసుపత్రుల్లో 4,800 వున్న పడకలను అధనంగా 1700 లకు చేర్చామన్నారు. ఆక్సిజన్ బెడ్లు 3,194 ఉండేవని వాటి సంఖ్య కూడా పెంచామని చెప్పారు. అలాగే ప్రతి బెడకు ఒక నర్స్ ఉండేలా 1160 మంది నర్సులను, ప్రతి 10 పడకలకు ఒక డాక్టర్ పర్యవేక్షణ ఉండేలా నియామకాలు జరిపామన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 5,500 ఎల్ పిఎం సామర్ధ్యం గల ఆక్సిజన్ ప్లాంట్ త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు. గత 15 రోజులుగా ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమాలోచన జరిపి స్వంత ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టుకోమని కోరామన్నారు. వాలంటీర్లు ఫీవర్ సర్వేపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రతి వారం కనీసం ఒక కోవిడ్ కేసు తీసుకురావాని ఆయన ఆదేశించారు.
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ కోవిడ్ రెండవ వేవ్ లో ఎంతో మంది ఆప్తులను, పొరుగువారిని కోల్పోయమన్నారు. మూడవ వేవ్ లో ఆ పరిస్థితి రాకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకుందని ఆమె చెప్పారు.
నగర పోలీస్ కమీషనర్ బత్తిన శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా నియంత్రణకు రెండు మార్గాలు లోపంగా ఉన్నాయన్నారు. ఒకటి భౌతిక దూరం పాటించకపోవడం, మాస్క్ ధరించకపోవడమే అన్నారు. కోవిడ్ మూడవ వేవ్ పట్ల నిర్లక్ష్యం వద్దని ఆయన నగర ప్రజలను కోరారు.
జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్.శివశంకర్ మాట్లాడుతూ నగరంలో 3,48,763 మందికి మొదటి డోస్ వ్యాక్సిన్ ఇచ్చామని, అలాగే 1,20,000 మందికి రెండవ డోస్ ఇచ్చామన్నారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్, డిఎంఅండ్ హెచ్ఓ డా.సుహాసిని, వీఎంసి అడిషనల్ కమీషనర్ శారద, సిఎం హెచ్ఓ గీతాబాయ్ తదితరులు పాల్గొన్నారు.