Breaking News

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించండి… : డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
రెండు రోజుల పర్యటన సందర్భంగా ఢిల్లీ వచ్చిన రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నిన్న కేంద్ర టూరిజం, సంస్కృతి మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి మరియు కేంద్ర ఫుడ్ ప్రొసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి పశుపతి కుమార్ పరస్ లను కలిసి ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించిన వివిధ అంశాల గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ రాష్ట్రం వ్యవసాయం పై ఆధారపడి ఉందని, రైతు పక్షపాతి అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ రంగంలో చేపట్టిన రైతు భరోసా, ఆర్ బీ కె ల వంటి సంక్షేమ పథకాలను కేంద్ర మంత్రి పశుపతి కుమార్ పరస్ కు వివరించామని అన్నారు. రాష్ట్రం విడిపోక ముందు దాదాపు 67% ఉన్న అగ్రికల్చరల్ డిపెండెన్సీ, విభజన అనంతరం 73-74% కి పెరిగిందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే బలమని ఆయన పేర్కొన్నారు. రైతు పండించిన పంటకు వాల్యూ అడిషన్, పంట నిల్వకు గిడ్డింగులు, రాష్ట్రంలో ఫుడ్ ప్రొసెసింగ్ పరిశ్రమల ప్రాముఖ్యత, వ్యవసాయానికి సంబంధించి కేంద్రం గతంలో ప్రకటించిన పథకాలను కొనసాగించడం పై మంత్రితో చర్చించామన్నారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు గురించి మంత్రి అడిగి తెలుసుకున్నట్టుగా తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధికి సహకరించవల్సిందిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి కోరడం జరిగిందని పేర్కొన్నారు. 975 కి. మీ పొడవు సముద్ర తీరం ఉన్న రాష్ట్రానికి పర్యాటక రంగంలో ఉన్న అవకాశాలు, అభివృద్ధి చేయాల్సిన మౌలిక సదుపాయాలు, టెంపుల్ టూరిజం, శ్రీశైలంకు ఇటీవల విడుదల చేసిన నిధులు మొదలైన అంశాలపై చర్చించామన్నారు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించిన సందర్భంగా మంత్రికి అభినందనలు తెలియజేయడం జరిగిందన్నారు. ఆగస్టు 6 లేదా 7 తేదీలలో మంత్రి ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చే అవకాశముందని తెలిపారు. హైదరాబాద్ కు అత్యంత చేరువలో ఉన్న తీర ప్రాంతం బాపట్లలోని సూర్యలంక బీచ్ అని తెలిపారు. సూర్యాలంక బీచ్ కు వచ్చే పర్యాటకులలో 80% దాకా హైదరాబాద్ నుండే వస్తున్నారన్నారు. సూర్యలంక బీచ్ కి సంబంధించి డీ.పీ.ఆర్ ను సమర్పిస్తామని మంత్రికి చెప్పామన్నారు. బాపట్లలో చోళులు నిర్మించిన క్షీర భావనారాయణ దేవాలయానికి సంబంధించి చేయవలసిన పనుల పై మంత్రితో మాట్లాడడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో దేశంలోనే అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా రాష్ట్రం విరాజిల్లుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Check Also

వైద్య విద్యలో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని తెచ్చింది జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వ‌మే

-పైగా కూట‌మి ప్ర‌భుత్వంపై బుర‌దజ‌ల్ల‌డం స‌మంజ‌స‌మేనా -రూ. 8540 కోట్ల‌కు గాను 1400 కోట్ల‌ను మాత్ర‌మే ఖ‌ర్చు చేశారు -విధ్వంసాన్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *