అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా ఆధ్వర్యంలో జులై 3 నుండి 5 వరకు అమెరికా మిషిగాన్ రాష్ట్రం, నోవీ నగరంలోని శుభర్బన్ కలెక్షన్ షోప్లేస్ వేదికగా 24వ తానా మహాసభలు నిర్వహించనున్నారు.
ఈ మహాసభలకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ని ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు తానా ప్రతినిధులు ఆయన్ను అసెంబ్లీలో స్పీకర్ చాంబర్ లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా తానా కాన్ఫరెన్స్ చైర్మన్ నాదెళ్ళ గంగాధర్, మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంట్ర, చందు గొర్రెపాటి, శ్రీనివాస్ నాదెళ్ళ. తదితరులు గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారికి సభ వివరాలను తెలియజేసి, ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.
తానా సంస్థ ఉత్తర అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘంగా గుర్తింపు పొందింది. ఈ సంస్థ నార్త్ అమెరికా తెలుగు సమాజానికి సామాజిక, సాంస్కృతిక, విద్యా రంగాల్లో విశేష సేవలందిస్తోంది అని . ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే తానా మహాసభలు భారతీయ వర్గాలలో అతిపెద్ద సదస్సులలో ఒకటిగా నిలుస్తాయి అని ఈ సందర్భంగా TANA మహాసభల చైర్మన్ గంగాధర్ నాదేళ్ళ అన్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక, వ్యాపార, ఆధ్యాత్మిక, రాజకీయ, వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర రంగాల్లో పేరుపొందిన ప్రముఖులు, కళాకారులు, రచయితలు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఆధ్యాత్మిక నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొంటారు. ప్రతిసారి దాదాపు 10,000 మందికిపైగా తెలుగు ప్రజలు ఈ మహాసభలకు హాజరవుతారు అని వారు తెలిపారు .
స్పీకర్ అయ్యన్నపాత్రుడు హాజరు వల్ల మహాసభలకు మరింత మన్నన లభిస్తుందని, ఈ సందర్భంగా ఆయన్ను ఆహ్వానించడాన్ని తాము గౌరవంగా భావిస్తున్నామని తానా ప్రతినిధులు తెలిపారు.