-వ్యవసాయానికి తొలిమెట్టు విత్తనం.. మేలురకం విత్తనం ద్వారానే రైతులకు అధిక దిగుబడులు…
-రైతు భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విత్తనాభివృద్ధి సంస్థ ది కీలకపాత్ర…
-ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయాన్ని రైతులు పండుగలా చేపట్టాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఆశయమని రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించి అధిక దిగుబడులు సాధించేందుకు విత్తనాభివృద్ధి సంస్థ కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ గా నియమితులైన పెర్నాటి హేమ సుష్మిత మంగళవారం విజయవాడ ప్రసాదంపాడులోని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టరు జి. శేఖర్ బాబు పెర్నాటి హేమ సుష్మితతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ రైతుల వ్యవసాయ విధానంలో తొలిమెట్టు విత్తనమేనన్నారు. నాణ్యమైన విత్తనాలను నాటడం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించినప్పుడు ఆర్థికంగా మేలు జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో వ్యవసాయం దండగనే భావనను రైతుల్లో కల్పించి వారిని నిర్లక్ష్యం చేయడం ద్వారా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి రైతులకు దిక్కుతోచని పరిస్థితులను కల్పించారన్నారు. ఈదశలో దివంగత నేత వై.యస్.రాజశేఖర రెడ్డి వ్యవసాయం దేశానికి జీవనాడి అని వ్యవసాయం అంటే ఒక పండుగ అనే భావనను కల్పిస్తూ రైతులను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి మరో నాలుగు అడుగులు ముందుకు వేసి రైతుభరోసా కేంద్రాలు ద్వారా రైతాంగానికి విత్తనం మొదలుకుని పంటల కొనుగోలు వరకూ సహకారం అందిస్తూ రైతుపక్షపాతిగా ముద్రవేసుకుంటున్నారన్నారు. ఈతరుణంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ రైతులకు మేలురకమైన విత్తనాలను సరఫరా చేసి వారిని ప్రోత్సహించి సంస్థను ముందుకు నడిపించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని నూతన ఛైర్మన్ హేమ సుష్మితకు సజ్జల రామకృష్ణా రెడ్డి సూచించారు.
రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖామంత్రి మేకపాటి గౌతంరెడ్డి మాట్లాడుతూ అన్నిరంగాలను అభివృద్ధి బాటలో నడిపించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో ఒకేసారి 135 కార్పోరేషన్లకు చైర్మన్లను నియమించారన్నారు. అత్యంత కీలకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు ఛైర్మన్ గా రైతుకుటుంబంకు చెందిన హేమసుష్మితను ఎంపిక చేయడం రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుచూపుకు నిదర్శనం అన్నారు. వ్యవసాయ సీజన్ లో ప్రాంతాలవారీగా రైతులకు అవసరమైన విత్తనాలను ముందుగానే సిద్ధం చేసుకుని సకాలంలో రైతులకు విత్తనాలను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఛైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన హేమసుష్మిత మాట్లాడుతూ విత్తన ఉత్పత్తిలో చిన్న సన్న కారు రైతులను భాగస్వాములను చేసి రైతుభరోసా కేంద్రాలు ద్వారా విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. విత్తనాభివృద్ధి సంస్థలో ప్రస్తుతం ఉన్న 4 లక్షల క్వింటాళ్ల విత్తన నిల్వ సామర్థ్యాన్ని 6 లక్షల క్వింటాళ్ల సామర్ధ్యానికి పెంచేందుకు చర్యలు తీసుకుంటామని, రైతులకు విత్తన నాణ్యత మరియు స్వచ్చతతో పాటు సంరక్షించే విధానంలో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నామన్నారు.
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టరు జి. శేఖర్ బాబు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ నుండి అందుకున్న ఇండెంట్లు ప్రకారం ప్రణాళికలను రూపొందించుకుని విత్తనోత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంస్థ ద్వారా రైతులకు తక్కువ ధరకే విత్తనాలను సరఫరా చేయడం జరుగుతున్నదన్నారు. రాష్ట్రంలో 1 లక్షల క్వింటాళ్ల విత్తన నిల్వ సామర్థ్యం
అవసరం కాగా ప్రస్తుతం 8 జిల్లాల్లో ఏపి సీడ్స్ 4 లక్షల క్వింటాళ్ల విత్తన నిల్వల సామర్ధ్యం గల కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వై.యస్.ఆర్. రైతుభరోసా కేంద్రాలు ద్వారా విత్తనాలను పంపిణీ చేసేందుకు 1210 స్వంత విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు రైతుభరోసా కేంద్రాలకు విత్తన నాణ్యతా పరీక్షాకిట్లను సరఫరా చేయడం జరిగిందని ఆయన వివరించారు. సంస్థ ద్వారా రాష్ట్రంలోని రైతాంగానికే కాకుండా దేశంలోని నేషనల్ సీడ్ కార్పోరేషన్‌కు కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు కూడా వరివిత్తనాలు పంపిణి చేస్తున్నామని, ఇంతవరకూ 35,960 క్వింటాళ్ల వరి విత్తనాలు పంపిణి చేశామని శేఖర్ బాబు అన్నారు.
కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి, శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి, మెరుగు నాగార్జున, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, పెర్నేటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజర్ పివియయస్. సుబ్బారావు, మాజీ డైరెక్టరు సలాది మురళీకృష్ణ, తదతరుల పాల్గొన్నారు.