విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఇరిగేషన్ కార్యాలయం రైతు శిక్షణా కేంద్రంలో గ్రామ, వార్డు సచివాలయాలపై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలు సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాలయ సేవలను మరింత విస్తరించడం, ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశం అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. గ్రామీణాభివృద్ది, పంచాయితీ రాజ్, గ్రామసచివాలయాల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాలలో మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకు వస్తున్నామని అన్నారు. ఇక పై గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్, పాన్ కార్డ్ లాంటి సేవలు అందించనున్నామని తెలిపారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్ధ సిఎం శ్రీ వైఎస్ జగన్ మానసపుత్రికలని, ప్రజలకు మెరుగైన పాలన అందించడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనల నుంచి పుట్టిన ఈ వ్యవస్ధల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పధకాలని నేరుగా ప్రజలకి అందించ గలుగుతున్నామని తెలిపారు. గ్రామ, వార్డ్ సచివాలయాల ఉద్యోగులను ప్రొబెషన్ విషయంలో కొంత మంది తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. ప్రోహిబిషన్ ఎగ్జామ్ లో ఎటువంటి రాజకీయాలు ఉండవని, ఏపీపీఎస్సి ద్వారా డిపార్టుమెంటల్ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగులకు ఎటువంటి అపోహలు అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఆగస్ట్ లో ఒకసారి, సెప్టెంబర్ లో ఒకసారి డిపార్ట్ మెంటల్ పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే 35 శాతం మందికి పరీక్షలు నిర్వహించామని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకి వచ్చే ఫిర్యాదులలో పరిష్కారమైనవి, తిరస్కరించినవి వేర్వేరుగా చూపాలని అధికారులను ఆదేశించామని అన్నారు. సచివాలయాలని తప్పనిసరిగా సందర్శించాలని సిఎం శ్రీ వైయస్ జగన్ ఇప్పటికే కలెక్టర్లు, జెసిలు, సబ్ కలెక్టర్లని ఆదేశించారని, ఇక పై నెలకు రెండు సార్లు మంత్రులగా మేము కూడా గ్రామ, వార్డ్ సచివాలయాలని సందర్శిస్తామని తెలిపారు. సీఎం శ్రీ వైయస్ జగన్ గ్రామస్ధాయి పర్యటనలు ప్రారంభించే లోపు సచివాలయాన్నింటిని పూర్తిగా సిద్ధం చేస్తామని, వాటి పనితీరును మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పరీక్షల పై సచివాలయ ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని ఎపిపిఎస్సీ ద్వారానే ఈ డిపార్ట్ మెంటల్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఇకపై గ్రామ, వార్డ్ సచివాలయంలో అందుబాటులో ఉండే సేవలను ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతి నెల ఆఖరి శుక్ర, శని వారాల్లో సచివాలయ సిబ్బంది ప్రతి గృహాన్ని సందర్శిస్తారని, ప్రభుత్వం అందిస్తున్న పధకాలతో కూడిన కరపత్రాలని సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తమ పరిధిలోని ఇళ్లకి వెళ్లి అందిస్తారని అన్నారు. దీనివల్ల ప్రభుత్వ పధకాలు అందుకోకుండా ఉన్న అర్హులని గుర్తించి, వారికి మేలు చేయడానికి మరింత అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. గ్రామ, వార్డ్ సచివాలయంలో మరిన్ని మెరుగైన సేవలకు కృషి చేస్తున్నామని అన్నారు.
ఈ సమావేశంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, గ్రామ, వార్డు సచివాలయాల ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, పిఆర్ కమిషనర్ గిరిజాశంకర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఎంఎం నాయక్, సెర్ప్ సిఇఓ ఇంతియాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.