-ఇంకా పూడిక జరగని లే అవుట్లలో యుద్ధప్రాతిపదికన గ్రామ పంచాయతీ లు పూడిక పనులు చేపట్టాలి..
-శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు
కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మనల్ని ఎన్నుకున్న ప్రజలకు సేవ చేయడమే మన ధ్యేయం కావాలని గ్రామాభివృద్ధిలో అధికారులు, ప్రజా ప్రతినిధులుసమన్వయంతో ఏ సమస్యయైనా సునాయసం పరిష్కరించవచ్చని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ వెలుగు కార్యాలయ సమావేశమందిరంలో హౌసింగ్ ప్రధాన అంశంగా జరిగిన సమీక్షా సమావేశం లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కైకలూరు మండలంలో నవరత్నాలు-పేదలందరికి ఇళ్లు కార్యక్రమంలో భాగంగా వివిధ విధానాల ద్వారా సేకరించి ఎంపిక చేయబడ్డ లే అవుట్లు పూడిక, లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల శంకుస్థాపనలు, నిర్మాణాలు ప్రస్తుత స్థితిని సమీక్షించారు. ఇంకా పూడిక జరగని లే అవుట్లలో యుద్ధప్రాతిపదికన గ్రామ పంచాయతీ లు పూడిక పనులు చేపట్టేలా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డీఎన్ఆర్ మాట్లాడుతూ మండలంలో గృహ నిర్మాణ పథకం అమలులో కొన్నిచోట్ల పూడిక చేయవలసి ఉందని కొన్ని చోట్ల ప్లాట్స్ విడగొట్టి లబ్ధిదారులకు చూపించవలసి ఉందని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు గ్రామాల్లో విజయవంతం కావాలంటే సర్పంచులు కీలక భూమిక వహించవలసి ఉంటుందని అన్నారు. సర్పంచ్ గ్రామంలో ప్రజల సమస్యలు పరిష్కరించడానికి వారికి మేలు చేయడానికి అవసరమైన సమయాల్లో తమకు గల ప్రత్యేక అధికారాన్ని వినియోగించి నిర్ణయాలు తీసుకోవచ్చనన్నారు. ఎక్కడైతే సైట్ లెవిలింగ్ చేయవలసిన అవసరం ఉందో అక్కడ వెంటనే 15 ఆర్ధిక సంఘ నిధుల నుండి పూడిక చేపట్టాలని అన్నారు. ఒక పని చేపట్టడం లో పంచాయితీ కార్యదర్శి సర్పంచ్ ముందుగా చర్చించుకుని తీర్మానం చేసి అంచనాలు వేయించి వర్క్ ఆర్డర్ పొంది పని చెయ్యాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు మేరకు ఎంత పెద్ద పని అయినా చేపట్టే అవకాశం సర్పంచ్ లకు ఉందన్నారు. మన గ్రామం మన ప్రజలు అనే భావంతో ముందుకు సాగుతుంటే ప్రజల మనస్సుల్లో చోటు సంపాదించుకో గల్గుతామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవారికి సొంతిల్లు ఇవ్వాలనే బృహదాశయంతో ప్రవేశపెట్టిన ఈ పథకం కళ్ళముందు ఆవిష్కృతమై మన ప్రజలు సుఖ శాంతులతో కాపురాలు చేసుకునే విధంగా సొంతింటిని అందించే ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి పేరు తెచ్చుకోవాలన్నారు. అలాగే జగనన్న మదిలో నుండి పుట్టిన మరో మంచి పధకం జగనన్న పచ్చతోరణం పధకం అన్నారు. మీ మీ గ్రామాలకు ఇవ్వబడిన మొక్కలు నాటించి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సర్పంచులను కోరుతున్నానన్నారు.
సభకు అధ్యక్షత వహించిన ఎంపీడీఓ వెంకట రత్నం మాట్లాడుతూ మండలం లో పేదలందరికి ఇళ్ళు కార్యక్రమం విజయవంతం కావడానికి అహర్నిశలు తగు సూచనలు ఇస్తూ అధికార యంత్రాంగాన్ని ప్రజాప్రతినిధులని ఎప్పటికప్పుడు సమన్వయం చేసి వెన్నుదన్నుగా నిలుస్తున్న శాసనసభ్యుల వద్ద పనిచేయడం మనందరికీ గర్వకారణం అన్నారు.
తహసీల్దార్ సాయి కృష్ణ కుమారి మాట్లాడుతూ శాసనసభ్యులు అండదండలతో ఎంతటి సమస్య అయినా సునాయాసంగా పరిష్కరించుకోగల్గుతున్నామన్నారు. రెవెన్యూ పరంగా మరింత శ్రద్ధతో పెండింగ్ పనులు పూర్తిచేస్తామన్నారు.
గృహనిర్మాణ శాఖ డిఈఈ ఆదినారాయణ మాట్లాడుతూ ఇంకా కొన్ని చోట్ల రెవెన్యూ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని సాధ్యమైనంత తొందరగా ఆ సమస్యలు తాహశీల్దార్ వారు తీర్చితే తాము ముందుకు వెళ్ళడానికి మార్గం సుగమం అవుతుందని సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో సర్పంచ్ డీయం నవరత్న కుమారి, ఎన్ఆర్ఇడీఎస్. ఏపీఓ చరణ్, హౌసింగ్ ఏఈ మూర్తి, మండలం లోని వివిధ గ్రామాల సర్పంచ్ లు,పంచాయితీ కార్యదర్శులు, సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.