-ప్రభుత్వం తరఫున సింధుకి రూ.30 లక్షల నగదు బహుమానాన్ని అందజేసిన అధికారులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధు శుక్రవారం కలిశారు. ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధును సీఎం అభినందించారు. ఈ సందర్భంగా ఆమెను సీఎం వైఎస్ జగన్ సత్కరించారు. మీ ఆశీర్వాదంతో కాంస్యం సాధించానని సీఎం జగన్‌తో సింధు అన్నారు. దేవుడి దయతో మంచి ప్రతిభ చూపారని సీఎం అభినందించారు. విశాఖలో వెంటనే అకాడమీని ప్రారంభించాలన్నారు. రాష్ట్రం నుంచి మరింత మంది సింధులు తయారు కావాలని సీఎం ఆకాంక్షించారు. ప్రభుత్వం తరపున సింధుకు రూ.30 లక్షల నగదును అధికారులు అందించారు. ఈ సందర్భంగా పీవీ సింధు మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌ను కలవడం ఆనందంగా ఉందన్నారు. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు సీఎం జగన్ ఆశీర్వదించారని, ఒలింపిక్స్‌లో మెడల్ తీసుకురావాలని కోరారని ఆమె తెలిపారు. ఏపీ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌కు 2 శాతం రిజర్వేషన్ గొప్ప విషయం అని పేర్కొన్నారు. నేషనల్స్‌లో గెలిచిన వారికి వైఎస్సార్ పురస్కార అవార్డులు ఇస్తున్నారన్నారు. అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కేటాయించిందని.. త్వరలోనే అకాడమీ ప్రారంభిస్తానని పీవీ సింధు తెలిపారు. సీఎంని కలిసిన అనంతరం ప్రభుత్వం తరపున సింధుకు రూ.30 లక్షల నగదు బహుమానాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్, స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ్, సమాచార శాఖ కమిషనర్ తుమ్మ విజయ్‌కుమార్ రెడ్డి, అధికారులు అందజేశారు.