-సబ్ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అందరిలో జాతీయ సమైక్యత సమగ్రత భావాలను మరింత పెంపొందించవలసిన అవశ్యకత ఎంతైన వుందని విజయవాడ సబ్ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ చెప్పారు. ఈ 2022 ఆగస్టు 15 నాటికి భారత స్వాతంత్ర్యం 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఏడాది పొడవున ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో మంగళవారం సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ నేతృత్వంలో రాష్ట్రీయగాన్ (జాతీయ గీతాలపాన) కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యం 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాది పాటు ఆజాదీకా అమృత్ మహోత్సవ పేరిట సంవత్సరం పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయన్నారు. స్వాతంత్ర్య స్ఫూర్తి అందరిలో ప్రతిబింబించేలా కార్యక్రమాలు రూపొందించబడ్డాయన్నారు. ఇందులో భాగంగా తమ కార్యాలయ సిబ్బంది, కొంత మంది అర్టిస్టులు, పౌరులతో రాష్ట్రీయగాన్ (జాతీయ గీతాలపాన) స్టూడియోలో రికార్డింగ్ చేసి ఈరోజు ఇక్కడ దానికి సంబంధించిన కార్యక్రమం నిర్వహించామన్నారు. రికార్డింగ్ చేసిన ఈ జాతీయ గీతాలపానను రాష్ట్రీయగాన్ పోటీలకు సమర్పించడం జరుగుతుందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు విధి నిర్వహణలో సర్విసు, ప్రజల కోసం ప్రభుత్వం ద్వారా అందించే కార్యక్రమాలు దేశం కోసం చేస్తున్నమనే భావన ఉద్యోగులు ప్రజల్లో కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ పరిపాలన అధికారి శ్రీనివాస్ రెడ్డి, తహాశీల్దార్ మాధురి, సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, పలువురు కళాకారులు, డిప్యూటీ తహాశీల్దార్, వీఆర్వోలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.