Breaking News

హాకీ ప్లేయర్ రజినీకి రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకం : మంత్రి అవంతి శ్రీనివాసరావు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటివల జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో హాకీ క్రీడలో విశేష ప్రతిభ చూపిన ఇ.రజినీ కి రాష్ట్ర ప్రభుత్వం రూ.25లక్షల ప్రోత్సాహకాన్ని ప్రకటించిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. సచివాలయంలోని మంత్రి చాంబర్ లో హాకీ ప్లేయర్ రజినీని మంత్రి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఇటివల టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ మహిళల హకీలో దక్షిణ భారతదేశం నుంచి పాల్గొని ఆడిన ఏకైక మహిళ రజినీ మన ఆంధ్రప్రదేశ్ కు చెందిన క్రీడాకారిణి ఇ.రజిని అని మంత్రి తెలిపారు. గత 10 ఏళ్లుగా ఆమె అనేక జాతీయ, అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్లలో పాల్గొని పలు పతకాలు సాధించిందని మంత్రి తెలిపారు. రజినీ స్వగ్రామం చిత్తూరు జిల్లాలోని భాకరాపేట దగ్గర్లోని యనమలవారి పల్లెకు చెందిన ప్లేయర్ అని తెలిపారు. పేద కుటుంబంలో పుట్టి అనేక కష్టాలకోర్చి ఈ స్థాయికి ఎదిగడం గొప్ప విషయమని అన్నారు. రజినీని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఘనంగా సన్మానించారని అన్నారు. పదేళ్లుగా ఆమె అనేక మెడల్స్ సాధించినా గత ప్రభుత్వాలు ఆమెకు అందించిన ఆర్ధికసాయం చాలా తక్కువని తెలుసుకుని ముఖ్యమంత్రి ఆమెకు పూర్తిస్థాయిలో నగదు ప్రోత్సాహకాలు అందించారని అన్నారు. ఈ సందర్భంగా సీఎం ఆమెకు 25లక్షల నగదు ప్రోత్సాహకం అందించాలని ఆదేశించారని అన్నారు. అంతేకాకుండా.. ఆమెకు గత ప్రభుత్వాలు ప్రకటించగా విడుదల కానీ.. 67.50 లక్షలను కలిపి మొత్తంగా 92.50 లక్షలను వెంటనే అందజేయాలని సీఎం ఆదేశించారని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రజినీకి కేటాయించిన 1000 గజాల స్థలం కూడా 22Aలో ఉండిపోవడంతో ఆమెకు స్థలం దక్కలేదని తెలుసుకున్న సీఎం.. వెంటనే ఆ చిక్కులు తొలగించి స్థలం ఆమెకు అందజేయాలని కూడా ఆదేశించారని అన్నారు. అంతర్జాతీయస్థాయిలో రాణిస్తున్న రజినీకి.. ఆమె ట్రయినింగ్, ఆర్ధికావసరాల నిమిత్తం ప్రతి నెలా రూ.40,000 లు అందేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. ఈక్రమంలో రజినీ కుటుంబసభ్యుల్లో ఒకరికి కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రభుత్వోద్యోగం ఇస్తామని కూడా సీఎం హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో రజినీ అనేక జాతీయ, అంతర్జాతీయ హకీ పోటీల్లో పాల్గొని విజయాలు నమోదు చేసి.. ఆంధ్రప్రదేశ్, భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచానికి తెలియజేయాలని అన్నారు. రానున్న రోజుల్లో రజినీ హాకీలో రాణించి అంతర్జాతీయస్థాయిలో మరింతగా రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి అన్నారు. ప్రస్తుతం ఉన్న క్రీడా పాలసీని మరింతగా మెరుగుపరచి కొత్త క్రీడా పాలసీని అమలులోకి తీసుకొస్తామని మంత్రి అన్నారు. రాజకీయ జోక్యం లేకుండా మట్టిలో మాణిక్యాలుగా ఉన్న అనేకమంది క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చి క్రీడాకారులుగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అన్నారు.
హాకీ క్రీడాకారిణి రజిని మాట్లాడుతూ హకీలో మరింతగా రాణించేందుకు తనను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గత 10ఏళ్లుగా అనేక మెడల్స్ సాధించినప్పటికీ ఆర్ధికంగా అనుకున్న స్థాయిలో ప్రోత్సాహం అందలేదని.. సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన సాయాన్ని మరచిపోలేనని అన్నారు. ప్రభుత్వ సహాయసహకారాలు ఉంటే మరింత శిక్షణతో కష్టపడి రాణించి మెడల్స్ సాధించి.. రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకొస్తానని అన్నారు. ఇప్పటికి రెండుసార్లు ఒలింపిక్స్ లో హాకీ ఆడానని మరింత పట్టుదలతో ఇకపై కూడా ముందుకెళ్తానని అన్నారు.
సాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి మాట్లాడుతూ.. టోక్యో ఒలింపిక్స్ లో మహిళల హాకీ జట్టు మంచి ప్రదర్శన చూపిందని అన్నారు. ఆ టీమ్ లో ఆడిన తెలుగు అమ్మాయి రజినికి ముఖ్యమంత్రి అన్నిరకాల సహాయ, సహకారాలు అందించడం సంతోషించే విషయమన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గ్రామ, మండల, జిల్లాస్థాయిల్లో నుంచి గుర్తించి ప్రోత్సాహిస్తామని తద్వారా దేశానికి, రాష్ట్రానికి పేరొచ్చేలా ముందుకెళ్తామన్నారు.
రాష్ట్ర పర్యాటక, శాఖ, క్రీడల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కొత్త క్రీడా పాలసీని త్వరలోనే తీసుకొస్తామని అన్నారు. తద్వారా క్రీడాకారులు పైకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాప్ ఎండీ ఎన్. ప్రభాకర్ రెడ్డి, టూరిజం సీఈఓ సత్యనారాయణ, సాప్ పరిపాలనాధికారి రామకృష్ణ, సాప్ అసిస్టెంట్ డైరక్టర్ శ్రీమతి రమణ, రజినీ కోచ్, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *