విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కుల, మతాలను ప్రాంతీయ తత్వాలను ఏకత్వం చేసినటువంటి వ్యక్తి గాంధీజీ అని విజయవాడ ఫస్ట్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దేవు నరసింహారావు అన్నారు. గాంధీజీ కలల సాఫల్యానికి అన్ని వర్గాలు నడవాలని సూచించారు. కరోన కష్ట కాలంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ గడ్డు పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులలో ప్రముఖ సాంస్కృతిక సేవా సంస్థ అర్పిత, ఏపీ స్టేట్ కల్చరల్ అవేర్నెస్ సొసైటీ ఏర్పాటు చేసినటువంటి 75 వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలు సాహసోపేతమైని పేర్కొన్నారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సంస్థ జరిపిన75వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ, విదేశాలలోని తెలుగు ప్రతిభావంతులను ఒకచోటకు చేర్చి భారీ స్థాయిలో చేసేటటువంటి కార్యక్రమాలు డా.గణగళ్ళ విజయ్ కుమార్ కే సొంతం అని ఆయన సంస్థ నిర్వాహకున్ని ప్రశంసించారు. భావితరాలకు సంస్కారాన్ని నేర్పడమే కాకుండా, ప్రతిభను ప్రోత్సహించే విధానాన్ని కూడా తెలపాలని వివరించారు. ఏపీ సర్వే ట్రైనింగ్ అకాడమీ ప్రిన్సిపాల్ సిహెచ్.వి.ఎస్.ఎన్ కుమార్ మాట్లాడుతూ 21 సంవత్సరాలుగా ఒక సంస్థ మనుగడ సాధించడం అసాధ్యమని అన్నారు. నిరంతర సేవా, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రతిభను ప్రోత్సహించడం లోనూ విజయ్ కుమార్ ముందున్నారని తెలిపారు. ఈ సంస్థ నుంచి గతంలో అవార్డులు తీసుకున్న ఎందరో ప్రతిభావంతులు జాతీయ స్థాయిలో రాష్ట్రపతి అవార్డులు పొందిన వ్యక్తులు కావటం గమనార్హం అని ఆయన పేర్కొన్నారు.
ఏపీయూడబ్ల్యూజే విజయవాడ కార్యదర్శి కొండ రాజేశ్వర రావు మాట్లాడుతూ సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంలో ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేవని, ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ ఉత్సవాలను నిర్వహించడం గొప్ప విషయమని అభిప్రాయపడ్డారు. అర్పిత, ఏపీ.ఎస్.సి.ఎ.సొసైటీ జాతీయ కార్యదర్శి డా.గణగళ్ళ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల ఈ పరిస్థితులలో తమ సంస్థ ఎప్పుడూ సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉందని ఆయన తెలిపారు. కరోనా లాక్ డౌన్ పరిస్థితులలోనూ అన్నదాన కార్యక్రమాలు సంస్థ చేపట్టిందని తెలిపారు. సేవా, సాంస్కృతిక కార్యక్రమాలకు సంస్థ ఎప్పుడూ ముందువరుసలో నిలుస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులకు పలు అవార్డులను ముఖ్య అతిధులు చేతుల మీదుగా సంస్థ ప్రధానం చేసింది. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకుడు డాక్టర్ గణగళ్ళ విజయ్ కుమార్ ను ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముందుగా నాట్య తరంగిణి కూచిపూడి నృత్య కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎన్. ప్రసన్నకుమార్, అనూష, కే.ఏ.రాజు తదితరులు పాల్గొన్నారు.