తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 20న వర్చువల్ విధానంలో జరుగనున్న వరలక్ష్మీ వ్రతం ఆన్‌లైన్ టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు బట్వాడా చేసేందుకు సిద్ధం చేసిన పూజాసామగ్రికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులతో కలిసి పూజాసామగ్రిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆ తరువాత అమ్మవారి మూలవిరాట్టు పాదాల వద్ద ఉత్తరీయం, రవిక, పసుపు, కుంకుమ, గాజులు, అక్షింతలు, కంకణాలు, కలకండ ఉంచి పూజలు చేశారు. అనంతరం ఈ పూజాసామగ్రిని గృహస్తులకు బట్వాడా చేసేందుకు పోస్టల్ అధికారులకు అందజేశారు.
అమ్మవారికి గాజులు విరాళం…
పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా తిరుచానూరుకు చెందిన శ్రీ షణ్ముగం వెయ్యి డజన్లు, తిరుపతికి చెందిన ఏడుకొండలు 1500 డజన్ల గాజులను శ్రీ పద్మావతి అమ్మవారికి కానుకగా అందించారు. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ప్రసాదంగా ఈ గాజులు అందించాలని ఆలయ అధికారులను దాతలు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో కస్తూరిబాయి, పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఏఈవో ప్రభాకర్‌రెడ్డి, సూపరింటెండెంట్ శేషగిరి, అర్చకులు బాబు స్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ పాల్గొన్నారు.