-డాక్టర్ జి.అజయ్ కుమార్ ఆధ్వర్యంలో యూరాలజీ సేవలు
-అందుబాటులో యూరో డైనమిక్ స్టడీ
-ఛాతీ, ఊపిరితిత్తుల సమస్యలకు డాక్టర్ ఎ.సింధూరి వైద్య సేవలు
-క్లినిక్ ని ప్రారంభించిన సెంటినీ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మొవ్వ ఆనంద్ శ్రీనివాస్, మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ మొవ్వ పద్మ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ జి.అజయ్ కుమార్, పల్మనాలజిస్ట్ డాక్టర్ ఎ.సింధూరిల ఆధ్వర్యంలోని అజయ్ యూరాలజీ అండ్ చెస్ట్ క్లినిక్ శనివారం ప్రారంభించబడింది. శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీ జీఎస్ఆర్ ప్లాజాలోని ఈ క్లినిక్ ను సెంటినీ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మొవ్వ ఆనంద్ శ్రీనివాస్, మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ మొవ్వ పద్మ లాంఛనంగా ప్రారంభించారు. ప్రఖ్యాత యురాలజీ, రోబోటిక్ చికిత్సా నిపుణులు డాక్టర్ ఎన్.మల్లిఖార్జునరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మొవ్వ ఆనంద్ శ్రీనివాస్, పద్మ దంపతులు మాట్లాడుతూ అత్యంత ప్రతిభావంతులైన ఇరువురు వైద్య నిపుణుల ఆధ్వర్యంలో క్లినిక్ ప్రారంభించబడటం సంతోషదాయకమన్నారు. సెంటినీ నందు సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న డాక్టర్ అజయ్ కుమార్, డాక్టర్ సింధూరి దంపతులు నూతన క్లినిక్ ద్వారా ప్రజలకు విస్తృత సేవలందిస్తూ, మరింత పేరు ప్రఖ్యాతులు గడించాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. అనంతరం డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ మూత్రాశయ సమస్యలు, ఛాతీ, ఊపిరితిత్తుల సమస్యలకు చికిత్సనందించేందుకు క్లినిక్ ను ప్రారంభించామని అన్నారు. సెంటినీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ మొవ్వ పద్మ మార్గనిర్దేశంలో సేవలందించడం ద్వారా వృత్తిపరమైన లక్ష్యాలను సులువుగా అధిగమించగలిగామని అన్నారు. తమ అభ్యున్నతిలో ఆనంద్ శ్రీనివాస్, పద్మ దంపతుల తోడ్పాటు మరువలేనిదని పేర్కొన్నారు. సెంటినీలో సేవలను కొనసాగిస్తూనే సాయంత్రం వేళల్లో ఈ నూతన క్లినిక్ ద్వారా ఓపీడీ సేవలను అందిస్తామని వెల్లడించారు. ఈ క్లినిక్ నందు స్త్రీ, పురుషులకు సంబంధించిన అన్ని రకాల మూత్రశయ సమస్యలు, మూత్రాశయంలో రాళ్లు, క్యాన్సర్, ప్రోస్టేట్ సమస్యలతో పాటు పురుషుల్లో సంతానలేమి సమస్యలకు చికిత్స అందిస్తామని తెలిపారు. మూత్ర సంబంధ సమస్యలను నిర్ధారించేందుకు అత్యాధునిక యూరో డైనమిక్ స్టడీ సదుపాయం తమ క్లినిక్ నందు అందుబాటులో ఉందని వెల్లడించారు. చిన్నపిల్లలకు సంబంధించి పక్క తడపడం తదితర మూత్ర సంబంధ సమస్యలకు తమ క్లినిక్ ద్వారా చికిత్సలందిస్తామని వివరించారు. ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఎ.సింధూరి మాట్లాడుతూ ఆస్తమా, టీబీ, సీవోపీడీ తదితర ఛాతీ, ఊపిరితిత్తుల సమస్యలకు చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య ప్రముఖులు పాల్గొని డాక్టర్ అజయ్ కుమార్, సింధూరి దంపతులను అభినందించారు.