-తద్వారా మనోబలం, ఆత్మవిశ్వాసం పెరిగి నవభారత నిర్మాణంలో భాగస్వాములు కాగలరు
-మన చరిత్ర, సంప్రదాయాల గురించి వారికి తెలియజేసేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలి
-కుటుంబ సమేతంగా చారిత్రక హంపి నగరాన్ని సందర్శించిన ఉపరాష్ట్రపతి
-పురావస్తు శాఖ వారు హంపిని సంరక్షిస్తున్న తీరు పట్ల సంతృప్తి
హంపి, నేటి పత్రిక ప్రజావార్త :
ఘనమైన సంస్కృతి, వారసత్వాలకు నిలయమైన భారతదేశం గత వైభవం గురించి యువత తెలుసుకోవాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. కర్ణాటక పర్యటనలో ఉన్న ఆయన శనివారం నాడు కుటుంబ సమేతంగా చారిత్రక హంపి నగరాన్ని సందర్శించారు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఇలాంటి ప్రదేశాల గురించి తెలుసుకోవడం ద్వారా యువతలో మనోబలం, ఆత్మవిశ్వాసం పెరిగి నవభారత నిర్మాణంలో భాగస్వాములు కాగలరని ఆకాంక్షించారు.
ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తించిన హింపిలో విజయనగర సామ్రాజ్య గతవైభవపు ఆనవాళ్ళు ఉన్నాయన్న ఉపరాష్ట్రపతి, నాటి శిల్పకళాశైలి ఎవరినైన మంత్ర ముగ్ధుల్ని చేస్తుందని తెలిపారు. మౌనంగా ఉండే రాళ్ళను, చైతన్యంతో కూడిన శిల్పాలుగా మలచిన శిల్పుల కళా చాతుర్యానికి ఈ నగరం నిదర్శనమని, ఇక్కడి ప్రతి రాయి ఓ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుందని తెలిపారు. బహుమనీ సుల్తానులు విజయనగర చారిత్రక సంస్కృతిని, ఆలయవైభవాన్ని నేటమట్టం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, హింపీ శిథిలాలు సైతం నాటి చరిత్రను మనకు తెలియజేస్తున్నాయని తెలిపారు.
వ్యక్తిగతంగా శ్రీ కృష్ణదేవరాయలను తాను ఎంతో అభిమానిస్తుంటానన్న ఉపరాష్ట్రపతి, తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉదయగిరి నియోజక వర్గం సైతం రాయలవారి సామ్రాజ్యంలో భాగంగా ఉండేదని తెలిపారు. రాయల వారి కాలంలో అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడమే కాకుండా, వ్యవసాయం ప్రాధాన్యతను గుర్తించి రైతుల కోసం చెరువులు తవ్వించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల్ని. కన్నబిడ్డల్లా చూసుకోవడమే కాకుండా, మన సంస్కృతిని, కళలను ప్రోత్సహించారని, ఆయన లాంటి ఆదర్శవంతమైన రాజులు చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తారని తెలిపారు.
సాహితీ సమరాంగణ సార్వభౌమునిగా ప్రసిద్ధి గాంచిన రాయలు అష్టదిగ్గజ కవుల ద్వారా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేశారన్న ఉపరాష్ట్రపతి, తెలుగు పంచ కావ్యాల్లో రాయల వారు రచించిన అముక్త మాల్యద సహా నాలుగు కావ్యాలు వారి కాలంలోనే వెలువడ్డాయని తెలిపారు. రాజమందిరం, గరుడ పుణ్యక్షేత్రం (రాతి రథం), విరూపాక్ష దేవాలయం, వినాయకుని చిత్రాలు, లక్ష్మీ నృసింహిడు, బడవిలిగం, విజయ విఠల దేవాలయం, గజశాల, పుష్కరిణి, పద్మ మహల్, హజారా రామ దేవాలయం, మహానవమి దిబ్బ, రాణుల స్నాన వాటికలు వంటి చారిత్రక కట్టడాలు హంపి వైభవాన్ని తెలియజేస్తున్నాయని తెలిపారు.
అద్భుతమైన సంస్కృతి వారసత్వాలకు పుట్టినిల్లు అయిన భారతదేశ చారిత్రక వైభవాన్ని తెలియజేసే హంపి లాంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయన్న ఉపరాష్ట్రపతి, వాటి గురించి ముందు తరాలకు తెలియజేసేందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని సూచించారు. ఇలాంటి ప్రదేశాల చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలన్న ఆయన, తల్లిదండ్రులు, విద్యా సంస్థలు పిల్లలకు మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేయాలని దిశానిర్దేశం చేశారు.
శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో హంపిని సందర్శించానని, నాటి రోజులను గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి, ఇప్పుడు మనుమడు, మనవరాళ్ళతో కలిసి ఇక్కడకు రావడం, మన చరిత్ర సంస్కృతుల గురించి వారికి తెలియజెప్పడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఇక్కడి చారిత్రక సంపదను సంరక్షిస్తున్న పురావస్తు శాఖ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా హంపిలోని విరూపాక్ష స్వామి వారి ఆలయాన్ని ఉపరాష్ట్రపతి సందర్శించారు. దేశసౌభాగ్యం, ప్రపంచ శాంతి కోసం స్వామిని ప్రార్థించారు.