-ఆగస్టు నెలకు వివిధ రకాల ఎరువులు 512656 టన్నులు అవసరం ఉంటే 835461 టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి…
-ఎవరైనా ఎరువులను అధిక ధరలకు అమ్మితే టోల్ ఫ్రీనం.155251కు ఫోన్ చేయాలి…
-ఎరువులు అధిక ధరలకు అమ్మే డీలర్లపై కఠిన చర్యలు…
-వ్యవసాయశాఖ కమీషనర్ హెచ్.అరుణ్ కుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సంబంధిచి ప్రధాన ఎరువులైన యూరియా,డి.ఎ.పి మరియు కాంప్లెక్సులు కావలసిన మొత్తానికి కంటే అధికముగా ఎరువుల నిల్వలు అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయని ఎరువులకు ఎలాంటి కొరత లేదని రైతులు ఏవిధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ కమీషనర్ హెచ్.అరుణ్ కుమార్ తెలియజేశారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కేంద్రాల(ఆర్.బి.కె)ద్వారా ఎరువుల సరఫరా నిరాటంకంగా జరుగుతోందని నాణ్యమైన ఎరువులను నిర్ధారిత ధరలకు రైతులకు అందించడంతో పాటు వివిధ ఎరువుల దుకాణాలందు కూడా నాణ్యమైన ఎరువులను నిర్ధారిత ధరలకు రైతులకు అందుబాటులో ఉంచడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
రైతు భరోసా కేంద్రాలల్లో మాత్రమే యూరియాను నిర్ధారిత ధరలకు అమ్ముతున్నారని మిగిలిన చోట అధిక ధరలకు విక్రయించుటకు ఎరువుల కంపెనీలు తగిన రవాణా వెసులుబాటు(ఎఫ్.ఓ.ఎల్)కల్పించనందున గిట్టుబాటు కాక కొంచెం అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వాస్తవం కాదని ఎందుకనగా యూరియా ఎమ్.ఆర్.పి ధరలోనే ఎఫ్.ఓ.ఎల్ ఛార్జీలను కూడా కలిపి ఉత్పత్తిదారులు నిర్ణయించి,ఎమ్.ఆర్.పి ప్రకారం యూరియాను సరఫరా చేస్తున్నారని కమీషనర్ అరుణ్ కుమార్ స్పష్టం చేశారు.ఎమ్.ఆర్.పిని మించి అమ్మిన డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఫామ్ ‘బి’లను లైసెన్సులో పొందుపరచడంలో ఎటువంటి జాప్యంలేదని మరియు ఫామ్ ‘ఓ’ లను మాన్యూవల్ గా కాకుండా ఈ ఆఫీస్ పద్ధతిలో లైసెన్సులో పొందుపరచడం జరుగుతోందని అరుణ్ కుమార్ తెలియజేశారు.
రాష్ట్రంలో వివిధ రకాల ఎరువుల లభ్యత వివరాలు:
క్ర.సం. ఎరువుపేరు. ఆగస్టు నెలకు అవసరం(టన్నుల్లో) లభ్యత(టన్నుల్లో)
1. యూరియా 204491 293778
2. డిఎపి 63320 68099
3. ఎమ్.ఓ.పి 29120 56777
4. ఎస్.ఎస్.పి 33184 68969
5. కాంప్లెక్సులు 182541 341628
మొత్తం 512656 835461
కావున రైతు సోదరులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఎవరైనా డీలర్లు ఎరువులను అధిక ధరలకు అమ్మినచో సంబంధిత వ్యవసాయాధికారులకు గాని లేదా సమీకృత రైతు సమాచార కేంద్రం గన్నవరం టోల్ ఫ్రీ నం.155251కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవలసిందిగా వ్యవసాయశాఖ కమీషనర్ హెచ్.అరుణ్ కుమార్ తెలియజేశారు.