Breaking News

జిల్లాలో 15వ ఆర్థిక సం ఘం నిధులతో ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి కోసం రూ. 41.96 కోట్లు… : జిల్లా కలెక్టరు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలన్నింటినీ అభివృద్ధి చేసేందుకు 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ. 41.96 కోట్ల రూపాయలు కేటాయించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నామని జిల్లా కలెక్టరు జె.నివాస్ చెప్పారు. సోమవారం స్థానిక కలెక్టరు కార్యాలయ సమావేశ భవనంలో జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. డియం హెచ్ఓ డా. యం. సుహాసిని, డిపిఓ జ్యోతి, జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరు జె.నివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్య కేంద్రాలన్నీ వచ్చే 5 ఏళ్ల లోపు సమూలంగా అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధిలోకి వస్తాయని చెప్పారు. ఇందుకు 15వ ఆర్థిక సంఘంలో 5 అంశాలపై దృష్టి పెడుతూ ఆరోగ్య వసతులను ప్రభుత్వం మెరుగుపరుస్తుందన్నారు. జిల్లాలోని 278 సబ్ సెంటర్లలో పనిచేసే సిబ్బందికి 3.35 లక్షల రూపాయలు జీతాల చెల్లింపు కోసం 9.31 కోట్ల రూపాయలు ప్రతిపాదించామన్నారు. అలాగే 13 బ్లాక్/మండల పబ్లిక్ హెల్త్ అర్బన్ కేంద్రాలలో ఒక్కోదానికి 80.96 లక్షలు కేటాయిస్తూ 10.52 కోట్ల రూపాయలు అవసరం పడుతుందని కలెక్టరు అంచనా వేశారు. అదేవిధంగా 783 హెల్త్ క్లినిక్ లలో ప్రాధమిక వ్యాధుల నిర్ధారణ కోసం పరీక్షలు నిర్వహించేందుకు 4.22 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. అలాగే జిల్లాలో ప్రాధమికంగా 13 మండలాల పిహెచ్ సిలలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామన్నారు. ఆ పిహెచ్ పిలలో 5 లక్షల రూపాయల విలువైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించే పరికరాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో 48.85 లక్షల రూపాయలతో 22 అర్బన్ హెల్త్ వెల్‌నెస్ సెంటర్లు అభివృద్ధి చేసేందుకు 10.74 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. అలాగే అందులో డయోగ్నస్టిక్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసేందుకు ఒక్కోదానికి 7.5 లక్షల రూపాయలు కేటాయించామని దీనికోసం 1.65 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. అలాగే 5 లక్షల రూపాయలతో 22 స్పెషలిస్ట్ క్లినిక్ లను కూడా అర్బన్ ప్రాంతాలలో ఏర్పాటు చేస్తామని కలెక్టరు చెప్పారు. రానున్న సంవత్సరాల్లో కోవిడ్ వ్యాధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. అలాగే కరోనా, డెంగ్యూ, మలేరియా జ్వరాలకు కూడా ప్రాధాన్యతనిచ్చి అందుకు తగ్గట్లుగా పరీక్షలు చేసే పరికరాలను కూడా అందుబాటులోనికి తీసుకువస్తున్నామన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ ప్రాజెక్టు జిల్లాలో ఇప్పటికే అమలవుతున్నదని దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తీసుకున్న నిర్ణయంతో ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నదన్నారు. జిల్లాలో ఉన్న 63 అర్బన్ హెల్త్ క్లినిక్ లో 41 క్లినిక్ లు నేషనల్ ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి పరుస్తున్నామన్నారు. మిగిలిన 22 అర్బన్ హెల్త్ క్లినిక్ లో కూడా వైద్యనిపుణుల సేవలు అందించేందుకు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని కలెక్టరు చెప్పారు. జిల్లాలోని కమిటీ సభ్యులందరూ ఆరోగ్య కేంద్రాలలో 14 రకాల పరీక్షలు అలాగే పిహెచ్ పిలలో 68 రకాల పరీక్షలు జరిగేలా నివేదికలు ఇవ్వాలన్నారు. ఈసమావేశంలో విజయవాడ రూరల్ యంపిడిఓ సునీత, వైశ్య మహిళా మండలి ప్రతినిధి రష్మి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

విద్యాసాగర్ పదవీ ప్రమాణస్వీకార మహోత్సవానికి తరలిరండి…

– ఏపీఎన్జీజీవో నగర శాఖ అధ్యక్షులు సివిఆర్ ప్రసాద్ పిలుపు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపి ఎన్జీజీఒ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *