Breaking News

విద్యుత్‌ రంగాన్ని నష్టాల్లోకి నెట్టింది చంద్రబాబే… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-రైతులపై కేసులు పెట్టి జైళ్లకు పంపిన ఘనత తెలుగుదేశానిది
-విద్యుత్‌ పంపిణీ సంస్థలకు.. చంద్రబాబు ఒక్క రూపాయీ చెల్లించలేదు
-టీడీపీ హయాంలో 2019 నాటికి రూ.32,000 కోట్లకు చేరుకున్న అప్పులు
-విద్యుత్‌ సంస్థలను ఆదుకున్న జగనన్న ప్రభుత్వం
-2019–21 మధ్య రూ.28,166 కోట్లు విడుదల : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్‌ రంగాన్ని బలోపేతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు  అన్నారు. ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం గత రెండేళ్లుగా అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల భారం పడకుండా చేయాలన్న లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి  నేతృత్వంలోని ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇందులో భాగంగా విద్యుత్‌ సంస్థల నిర్వహణ వ్యయాన్ని భారీగా తగ్గించేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. మార్కెట్లో విద్యుత్‌ ధరలను ఎప్పటికప్పుడు గమనిస్తూ చౌకగా లభించే సమయంలో ఎక్కువగా తీసుకునేందుకు ప్రత్యేక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేయడమైనదన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్, మార్కెట్లో లభ్యతను శాస్త్రీయంగా గుర్తించేందుకు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను విద్యుత్‌ శాఖ ఏర్పాటు చేసిందన్నారు.

రైతులను జైళ్లకు పంపిన చరిత్ర చంద్రబాబుది
విద్యుత్ చార్జీలు చెల్లించని రైతులపై కేసులు పెట్టి జైళ్లకు పంపిన చరిత్ర చంద్రబాబుదని మల్లాది విష్ణు మండిపడ్డారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫాస్ట్‌ ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు కూడా జారీచేశారన్నారు. రైతులపై నాడు దాదాపు 78 వేల అక్రమ కేసులు నమోదు చేశారని గుర్తుచేశారు. అంతేగాకుండా అటు గృహ వినియోగానికి, ఇటు వ్యవసాయానికీ చార్జీలు పెంచిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. చార్జీలు చెల్లించడం లేదని వ్యవసాయ కనెక్షన్లను తొలగిండమేకాకుండా, పొలాల మీద పడి మోటార్లు ఎత్తుకెళ్లారన్నారు. పంటలు ఎండిపోతున్నా కనికరించలేదన్నారు. పైగా విద్యుత్ ఛార్జీలు తగ్గించమని అడిగిన వారిపై కాల్పులు జరిపించి, గుర్రాలతో తొక్కించిన విషయం మరిచిపోయారా..? అని తెలుగుదేశం నాయకులను సూటిగా ప్రశ్నించారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే తీగలు బట్టలారేసుకోవడానికే పని కొస్తాయని చంద్రబాబు ఎద్దేవా చేశారని గుర్తుచేశారు. కానీ రైతులకు వరంలా ఉచిత విద్యుత్‌ను అమలు చేసి చూపిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి దన్నారు.

గడిచిన ఐదేళ్ల చంద్రబాబు పాలనలో విద్యుత్‌ రంగం పూర్తిగా నష్టాల్లోకి నెట్టబడిందన్నారు. 2019 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఏపీఎస్పీడీసీఎల్‌ రూ.12,539 కోట్లు నష్టంలోనూ, ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ రూ.7,745 కోట్ల నష్టంలోనూ ఉన్నాయని తెలిపారు. మరోవైపు.. 2014లో రాష్ట్ర విభజన జరిగిన నాటికి రూ.12,500 కోట్లు వున్న కొనుగోలు బకాయిలు, నిర్వహణ వ్యయ రుణాలు 2019 ఏప్రిల్‌ 1 నాటికి రూ.32,000 కోట్లకు చేరుకున్నాయన్నారు. చంద్రబాబు అసమర్థ పాలనతో నష్టపోయిన విద్యుత్ పంపిణీ వ్యవస్థను.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి  గాడిలో పెడుతున్నారని వివరించారు.

విద్యుత్‌ సంస్థలను ఆదుకున్న జగనన్న ప్రభుత్వం
మార్చి 31, 2019 నాటికి విద్యుత్‌ సబ్సిడీ బకాయిలు రూ.13,388 కోట్లు ఉండగా జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం రూ.11,442 కోట్లు ఇచ్చిందని మల్లాది విష్ణు  అన్నారు. 2019–21 సంవత్సరాల్లో విద్యుత్‌ సబ్సిడీ, ఇతర చార్జీల కింద మరో రూ.16,724 కోట్లు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ సంస్థలకు రూ.28,166 కోట్లు విడుదల చేసిందన్నారు. విద్యుత్‌ రంగాన్ని పట్టిష్టం చేయడానికి 7 వేలకుపైగా జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులు భర్తీ చేశామని, 172 మంది అసిస్టెంట్‌ ఇంజినీర్ల నియామకం చేపట్టామన్నారు. 30 ఏళ్లపాటు పగటి పూట వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందించేందుకు 10 వేల మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్‌ కేంద్రాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.

కరెంట్ ఛార్జీల పాపం ముమ్మాటికీ చంద్రబాబుదే
విద్యుత్ ట్రూఅప్ ఛార్జీల విధింపునకు గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అవలంభించిన విధానాలే కారణమని మల్లాది విష్ణు అన్నారు. ట్రూ–అప్‌ సర్దుబాటు కోసం 2014 నుండి 2019 మధ్య ఒక్క రూపాయి కూడా విద్యుత్‌ పంపిణీ సంస్థలకి నాటి తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేయలేదని గుర్తు చేశారు.

విద్యుత్తు కొనుగోళ్లలో రూ.2,342 కోట్లు ఆదా
విద్యుత్తు కొనుగోళ్లలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గత రెండేళ్లలో రూ.2,342 కోట్లకుపైగా ఆదా చేసిందని నీతి ఆయోగ్, ఆర్‌ఎంఐ సంస్థ సంయుక్తంగా రూపొందించిన నివేదిక వెల్లడించిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు  గుర్తుచేశారు. 2019–21 మధ్య రెండేళ్లలో విద్యుత్తు కొనుగోళ్లలో అనుకూల విధానాల ద్వారా ఇది సాధ్యమైందన్నారు. కనుక విద్యుత్ రంగంపై మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకి కానీ, తెలుగుదేశం తొత్తులకి కానీ లేదని మరోసారి స్పష్టం చేశారు.

Check Also

జిల్లా అభివృద్దికి కేటాయించిన 200 కోట్ల రూపాయల పనులను జనవరి చివరి నాటికి అన్నీ పూర్తి చేయాలి

-వంద కోట్ల పనులను 70 శాతం సంక్రాంతి పండగ నాటికి పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *