– జగన్ పై మంత్రి సవిత ఫైర్
– తుని, పల్నాడు ఘటనల వెనుక వైసీపీ గుండాలు
– రప్పా…రప్పా… అని జగన్ అంటుంటే రెచ్చిపోతున్న వైసీపీ బ్యాచ్
– పండగపూట రాష్ట్రంలో దాడులు, అలజడులు
– అధికారం కోసం జగన్ హత్య, శవ రాజకీయాలు
– దాడులకు, దౌర్జన్యాలకు తెగబడితే ఉక్కుపాదంతో అణిచివేస్తాం : మంత్రి సవిత
పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త :
జగన్ ప్రోద్బలంతోనే వైసీపీ గూండాలు రెచ్చిపోతున్నారని, పండగపూట తుని, పల్నాడులో జరిగిన హత్యలకు ఆయన వ్యాఖ్యలే కారణమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. సంక్రాంతి పండుగను ప్రజలంతా ఆనందోత్సవాలతో జరుపుకుంటుంటే, వైసీపీ గూండాలు మాత్రం రప్పా…రప్పా…అంటూ రాష్ట్రంలో దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. పల్నాడులో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణను కూలాలకు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. తుని నియోజక వర్గం కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, బీసీ నేత లాలం బంగారయ్యను అతి కిరాతికంగా హత్య చేశారన్నారు. దాడులకు, హత్యలకు పాల్పడేవారిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని మంత్రి హెచ్చరించారు. ఆదివారం పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. అధికారం కోల్పోవడంతో జగన్ మతిభ్రమించిందన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని, ప్రజలు ఆనందోత్సవాలతో సంక్రాంతి జరుపుకోవడాన్ని చూసి ఓర్వలేకపోతున్నాడన్నారు. హత్య రాజకీయాలకు, శవ రాజకీయాలకు తెర లేపి, వైసీపీ గూండాలతో రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి కుట్ర పన్నాడని జగన్ పై మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్ ఎన్ని కుట్రలు పన్నినా, రప్పా… రప్పా…అని బెదిరించినా రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని మరింత పరుగులు పెట్టిస్తామని మంత్రి సవిత స్పష్టంచేశారు.
కులాల మధ్య కొట్లాటకు జగన్ కుట్ర
పల్నాడు జిల్లామాచవరం మండలం పిన్నెలి గ్రామంలో ఇద్దరు దళిత యువకులు కత్తులతో ఘర్షణ జరిగి ఒక వ్యక్తి మృతి చెందాడని మంత్రి సవిత తెలిపారు. ఈ ఘటన బాధాకరమన్నారు. ఈ ఘటనపై జగన్ శవ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగత జరిగిన ఘర్షణను కులాలకు ఆపాదిస్తూ, కొట్లాటకు జగన్ కుట్ర పన్నుతున్నాడని మండిపడ్డారు. ఆయనకు మొదటి నుంచి శవ రాజకీయాలు చేయడం అలవాటుగా మారిందన్నారు. తండ్రి శవంతోనే సీఎం కుర్చీ కోసం పాకులాడని ఘనుడని విమర్శించారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలోనూ, పల్నాడు జిల్లాలోనూ రక్తం ఏరులై పారిందన్నారు. ఎందరో ఎస్సీలను, బీసీలను, టీడీపీ నాయకులను హత్య చేశారన్నారు. బీసీలైన అమర్నాథ్ గౌడ్, తోట చంద్రయ్య హత్య చేయడంతో పాటు మాస్క్ అడిగిన పాపానికి దళిత వైద్యులు సుధాకర్ పై పిచ్చోడు ముద్ర వేసి ఏవిధంగా ప్రాణం తీసుకునే ఏవిధంగా వేధించారో ప్రజలందరికీ తెలుసన్నారు. దళిత డ్రైవర్ ను చంపిన డోర్ డెలివరీ చేసిన ఘటనలను ఎవరూ మరిచిపోలేదన్నారు.
జగన్ ప్రోద్బలంతోనే దాడులు
రప్పా…రప్పా… నరుకుతామంటూ జగన్ సహా వైసీపీ పెద్దలు బహిరంగంగానే అంటుండడంతో ఆ పార్టీ గూండాలు రెచ్చిపోతున్నారు. రాష్ట్రమంతటా సంక్రాంతి సంబరాలు జరుగుతుంటే, జగన్ ప్రోద్బలంతో వైసీపీ గూండాలు కత్తులతో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారు. గత రెండు మూడ్రోజుల నుంచి రాష్ట్రంలో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనమన్నారు. తుని నియోజక వర్గం కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, బీసీ నేత లాలం బంగారయ్యను అతి కిరాతకంగా హత్య చేశారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అలజడులు, దాడులు, హత్యలకు రప్పా…రప్పా… అంటే తప్పేంటి అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలే పరోక్షంగా కారణమయ్యాయన్నారు. దాడులకు, హత్యలకు పాల్పడేవారిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని మంత్రి హెచ్చరించారు.
Prajavartha Online Telugu News