– కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
మధురపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రి విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ భవన పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్షించారు. విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం విమానాశ్రయ అధికారులు, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) అధికారులతో నిర్మాణ పురోగతిపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో జరుగుతున్న టెర్మినల్ అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించిన మంత్రి, పనులను వేగవంతం చేసి మార్చి 31లోపు పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్ సంస్థకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
నూతన టెర్మినల్ భవనం ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా రూపుదిద్దుకుంటున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.
తదుపరి విమానాశ్రయ ప్రాంగణంలో “ఏక్ పెడ్ మా కే నామ్ సే” కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి మొక్కను నాటారు. రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని, రాజమహేంద్రవరం సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతకు అనుగుణంగా, గోదావరి ప్రాంత ప్రజలకు గేట్‌వేగా మారేలా ఈ విమానాశ్రయం అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ఈ నూతన టెర్మినల్ ద్వారా ప్రాంతీయ కనెక్టివిటీ, పర్యాటకం, ఆర్థిక వృద్ధికి మరింత ఊతం లభిస్తుందని, త్వరలో రాజమండ్రికి మరిన్ని విమాన సర్వీసులు కూడా ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బత్తుల బలరామ కృష్ణ, ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ,
విమానాశ్రయ డైరెక్టర్ ఎన్.కే. శ్రీకాంత్, టెర్మినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. రామాచారి, ఇంజనీర్ ప్రీతా, ప్రాజెక్ట్ డీజీఎంలు వి. శ్రీనివాస్, ఆర్.ఎస్.ఎం. మూర్తి,
ఇతర ఇంజనీరింగ్, ఎయిర్‌పోర్ట్ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News