-భవానీలు, భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో చివరి రోజైన “విజయదశమి” సందర్భంగా శ్రీ అమ్మవారు శ్రీరాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరాజరాజేశ్వరీదేవి అవతారంలో వున్న అమ్మవారిని దర్శించుకొంటే అంతా జయమే కలుగుతుందని వేదాలలో చెప్పబడింది. తెల్లవారుజామునుండే భక్తులు అమ్మవారి దర్శించుకొనేందుకు భక్తులు బారులు తీరారు. రాష్ట్రం నలుమూలల నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. రాష్ట్రంలోని పలుప్రాంతాల నుండి భవానీ దీక్షాదారులు అమ్మవారిని దర్శించుకొనేందుకు బారులు తీరారు. దీనితో క్యూలైన్లు భక్తులతోపాటు భవానీలతో కిక్కిరిసిపోయాయి. జై భవానీ జైజై భవానీ అనే నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగిపోయింది. తలనీలాలు ఇచ్చే ప్రాంతంలో, పుణ్యస్నానాలు ఆచరించే ప్రాంతంలో భక్తులు, భవానీలు క్యూ కట్టారు. దసరా చివరి రోజున దుర్గమ్మను రాజరాజేశ్వరిదేవిగా దర్శించుకొనేందుకు భక్తులు ఊవిళ్ళూరారు. దుష్టశిక్షణ చేసి లోకాన్ని కాపాడిన దుర్గమ్మ వీర విజయ విహారానికి చిహ్నమే రాజరాజేశ్వరీ అలంకారం. చిరునవ్యు మోముతో, వరద అభయ ముద్రలతో దర్శనమిచ్చిన తల్లిని చూసి భక్తజనం ఉప్పొంగిపోయింది. పిల్లాపాపలతో చల్లగా ఉండేలా దీవించమని అమ్మను మనసారా వేడుకుంది. వచ్చే ఏడాది మళ్ళీ నీ దర్శనభాగ్యం కలిగించమని ప్రార్ధించింది. దేవినవరాత్రులలో తొమ్మిది రోజుల ముగిసిన తరువాత జరుపుకొనే విజయదశమి, అపరాజితా దేవి పేరు మీద ఏర్పడిందని పండితులంటారు. ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవి వివిధ కల్పాలలో నానావిధ దుష్టదనుజుల్ని, వివిధ రూపాలు ధరించి సంహరించి లోకానికి ఆనందాన్ని కలిగించింది. ఆ ఆదిపరాశక్తి మహాత్రిపుర సుందరి శ్రీరాజరాజేశ్వరీ దేవి పరమశాంత స్వరూపంలో చిరునవ్వులు చిందిస్తూ ఇక్షుఖండాన్ని (చెరుకుగడ) చేతిలో ధరించి ఒక చేత అభయ ముద్రని చూపిస్తూ విజయదశమినాడు దర్శనమిస్తుంది. అన్నింటా విజయాన్ని సాధించాలనుకునే వారు ఎవరైనా అపరాజతాదేవి స్వరూపమైన రాజరాజేశ్వరీదేవిని దర్శిస్తే అపజయమే ఉండదు. హోమశాలలో దసరా మహోత్స వాల ముగింపును పురస్కరించుకొని పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు.