-భక్తిపారవశ్యంతో పులకరించిన దుర్గా ఘాట్…
-జై దుర్గమ్మ జై జై దుర్గమ్మ అంటూ జగన్మాతను స్మరించుకున్న భక్తజనకోటి…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపులో భాగంగా విజయదశమి రోజున ఇంద్రకీలాద్రి అధిష్టాన దేవత శ్రీ కనక దుర్గాదేవికి పవిత్ర కృష్ణానదిలో హంసవాహనంపై తెప్పోత్సవ కార్యక్రమాన్ని కన్నులపండువగా నిర్వహించారు. హంసవాహనంపై ఉత్సవ విగ్రహాలను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించిన హంస వాహనంలో ఆదిదంపతులు దుర్గామల్లేశ్వరస్వామివార్లు కొలువుతీరి భక్తుల నీరాజనాలు అందుకున్నారు. దాదాపు గంటన్నరపాటు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఈ సుందర దృశ్యాన్ని భక్తులు భారీగా దర్శించుకున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదిలో ఎగువ నుండి వస్తున్న వరద నీటి ఉధృతి దృష్ట్యా దుర్గా ఘాట్లో ఈ ఏడాది హంస వాహనాన్ని నిలకడగానే ఉంచి హంస వాహన తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కన్నుల పండువగా జరిగిన ఈ ఉత్సవాన్ని భక్త జనకోటి వీక్షించారు.అంతకుముందు దుర్గ గుడి అధికారులు, పురోహితులు పోలీసులు స్వామివార్ల ఉత్సవ మూర్తులను నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి మేళ తాళాలు, కోలాట ప్రదర్శనల నడుమ ఊరేగింపుగా దుర్గా ఘాట్‌కు తీసుకువచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనంపై ఉత్సవమూర్తులను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యుత్ దీపకాంతులు, మేళతాళాలు, పవిత్ర హారతులు, బాణసంచా వెలుగుల మధ్య హంస వాహన తెప్పోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ వాహన సేవలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి. వాణిమోహన్, ధర్మకర్తల మండలి చైర్మన్ పైలా సోమినాయుడు,నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, శాసనసభ్యులు మల్లాది విష్ణు, జిల్లా కలెక్టర్ జె.నివాస్, జాయింట్ కలెక్టర్ మాధవి లత, దుర్గ గుడి ఈవో డి భ్రమరాంబ, ధర్మకర్తల మండలి సభ్యులు, సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ తదితరులు పాల్గొన్నారు.