-తదేకం ఫౌండేషన్ సహకారంతో నిడదవోలు క్యాంప్ కార్యాలయంలో దివ్యాంగులకు ట్రైసైకిల్స్, ఎలక్ట్రికల్ స్కూటర్ పంపిణీ
-రాబోయే రోజుల్లో ఫౌండేషన్ సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడి
-2027 గోదావరి పుష్కరాల్లోనూ తదేకం ఫౌండేషన్ భాగస్వామ్యం ఉంటుందని ప్రకటన
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలోని అట్టడుగు వర్గాలకు, ముఖ్యంగా దివ్యాంగులకు అండగా నిలవడమే పరమావధిగా ‘తదేకం ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ కొనియాడారు. సోమవారం నిడదవోలులోని తన క్యాంప్ కార్యాలయంలో తదేకం ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన ట్రైసైకిల్స్ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గ్రీన్ రిబ్బన్ కట్ చేసి వాహనాలను ప్రారంభించారు. లబ్ధిదారులు కొప్పాక సీతారాంబాబు, మంత్రి ప్రగడదేవి, దాసరి శివలకు ట్రైసైకిల్స్, అలాగే పిడుగు గోవిందరాజుకు ఎలక్ట్రికల్ స్కూటర్‌ను అందజేశారు. ఈ పరికరాలను సద్వినియోగం చేసుకుని ఆనందంగా ఉండాలని లబ్ధిదారులను మంత్రి దుర్గేష్ ఆశీర్వదించారు.ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ..ఒక ప్రైవేట్ సంస్థ అయినప్పటికీ సామాజిక బాధ్యతతో తదేకం ఫౌండేషన్ ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఈ ఫౌండేషన్ స్థానిక ఇన్ఛార్జ్ సుధా మరియు వారి బృందం నిడదవోలు నియోజకవర్గంలోని దివ్యాంగులకు సహకరించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. గత ప్రభుత్వాల కంటే మిన్నగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్‌ను రూ.3,000 నుండి రూ.6,000 కు పెంచిందని మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.15,000 సాయం అందిస్తున్నట్లు తెలిపారు.తదేకం ఫౌండేషన్ సహకారంతో రాబోయే రోజుల్లో మరిన్ని పంపిణీ కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల్లోనూ తదేకం ఫౌండేషన్ సహకారాన్ని కోరామని, వచ్చే నెల నుండి దీనికి సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేస్తామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఇలాగే చేతులు కలిపితే పేదలకు మరింత మేలు జరుగుతుందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News