-పేదవాడి గుండె ధైర్యం.. ముఖ్యమంత్రి సహాయనిధి అని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్
-నిడదవోలు క్యాంపు కార్యాలయంలో 38 మంది లబ్ధిదారులకు రూ.26.32 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వోసీ పత్రాలు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్
-ప్రతి పేద కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య భీమా.. విప్లవాత్మక మార్పుకు సీఎం చంద్రబాబునాయుడు త్వరలోనే శ్రీకారం చుడతారని వెల్లడి
-సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి దుర్గేష్ లకు కృతజ్ఞతలు తెలిపిన బాధిత లబ్ధిదారులు
-ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని, భరోసాగా సీఎం సహాయనిధి ఉందని ధైర్యం ..సీఎంఆర్ఎఫ్ తో నిరుపేదలకు ఆర్థిక రక్ష కల్పిస్తున్నామన్న మంత్రి దుర్గేష్
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
“కన్నీరు తుడిచే చేయి.. కష్టం తీర్చే గుండె.. కూటమి ప్రభుత్వానికి నిరంతర ఆయుధాలు” అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఉద్ఘాటించారు. నిరుపేదల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా, ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారుతోందని ఆయన అభివర్ణించారు. సోమవారం నిడదవోలులోని తన క్యాంపు కార్యాలయంలో 38 మంది లబ్ధిదారులకు రూ. 26,32,753 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు మరియు ఎల్ వోసీ పత్రాలను మంత్రి దుర్గేష్ స్వయంగా పంపిణీ చేశారు. అందులో 35 మందికి రూ. 19,76,689 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను, ముగ్గురికి రూ. 6,56,064 విలువైన ఎల్ వోసీ పత్రాలను మంత్రి దుర్గేష్ స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, గత 19 నెలల కాలంలో నిడదవోలు నియోజకవర్గంలో అక్షరాలా 673 మందికి రూ. 5,12,20,251 లబ్ధి చేకూర్చామని సగర్వంగా ప్రకటించారు. “ప్రతి 15 రోజులకొకసారి పేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందించడం నా రాజకీయ జీవితానికి లభిస్తున్న అసలైన సంతృప్తి” అని ఆయన భావోద్వేగంతో పేర్కొన్నారు. వైద్య ఖర్చుల భారంతో కుంగిపోతున్న కుటుంబాలకు ఈ నిధులు కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల నుంచి పుట్టిన విప్లవాత్మక మార్పును మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య భీమా కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయని, ఇది 5 కోట్ల ఆంధ్రుల జీవితాలకు కొండంత అండగా నిలుస్తుందని వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తితో ప్రతి ఇంట్లో ఒక మహిళా పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ సంకల్పమని గుర్తు చేశారు.
కార్పొరేట్ స్థాయి వైద్యం తమకు ఉచితంగా అందేలా చొరవ చూపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్‌లకు లబ్ధిదారులు నిండు మనసుతో ధన్యవాదాలు తెలిపారు. ఆపదలో అండగా నిలిచిన నేతలను వారు ఆశీర్వదించడం కార్యక్రమానికి ఒక ప్రత్యేక శోభను చేకూర్చింది. ప్రభుత్వం చేస్తున్న ఈ మంచి కార్యక్రమాల్లో ప్రజలు కూడా భాగస్వాములై, సమాజ పునర్నిర్మాణానికి సహకరించాలని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News