-సోము వీర్రాజు పిచ్చి ప్రేలాపనలు కట్టిపెట్టాలి
-బీజేపీ నేతలు కావాలనే మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు
-రాష్ట్రాభివృద్ధిపై కేంద్రంతో ఏనాడైనా సోము వీర్రాజు మాట్లాడారా..?
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు సోము వీర్రాజు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. శ్రీశైలం ఘటనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు వక్రీకరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుచిత వ్యాఖ్యలు, మత రాజకీయాలతో ఏపీలో లబ్ధి పొందేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరీముఖ్యంగా అడుసు తొక్కి, ఆ తర్వాత కాళ్లు కడుక్కోవడం సోము వీర్రాజుకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. సాక్షాత్తూ పరమశివుడు కొలువైన శ్రీశైల మహా పుణ్యక్షేత్రంపై సోమువీర్రాజు చేస్తున్న దిగజారుడు వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఇరువురు వ్యక్తుల మధ్య జరిగిన గొడవను రెండు మతాల మధ్య జరుగుతున్న వివాదంగా చిత్రీకరించడం బీజేపీ నేతల దివాళకోరుతనానికి అద్ధం పడుతోందన్నారు. సోము వీర్రాజు చేస్తున్న పిచ్చి ప్రేలాపనలు చూస్తుంటే.. చంద్రబాబు అందించిన స్క్రిప్టులా ఉందన్నారు. సీఎం జగన్ పాలనలో హిందుత్వ పరిరక్షణలో రాజీపడే ప్రసక్తి లేదని.. నిందితులపై చర్యలు కఠినంగా ఉంటాయని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఏపీ మాదిరిగా హిందూ ఆలయాల్లో పరిరక్షణ చర్యలు లేవన్నారు.
సోము వీర్రాజుకు ఆయన నోరే శత్రువైందనే మల్లాది విష్ణు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు హయాంలో జరిగిన దాడులపై మాట్లాడని బీజేపీ నేతలు ఇప్పుడు ఎందుకు అనవసర విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాభివృద్ధిపై కేంద్రంతో ఏనాడైనా సోము వీర్రాజు మాట్లాడారా..? అని సూటిగా ప్రశ్నించారు. బీజేపీ నాయకులు మాట్లాడవలసింది ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు, విడిపోయిన రాష్ట్రానికి నిధుల మంజూరుపై అని మల్లాది విష్ణు అన్నారు. ఆ పాత్ర పోషించకుండా మతాల పేరిట సమాజంలో చీలికలు తీసుకువచ్చేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. ఏపీలో బీజేపీని ఎవరూ పట్టించుకోరని, అందుకే మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి చూస్తున్నారని దుయ్యబట్టారు. చీప్ లిక్కర్ ఇచ్చి.. ఓట్లు అడిగే దౌర్బాగ్యస్థితికి సోము వీర్రాజు చేరుకున్నారని విమర్శించారు. సోము వీర్రాజు లాంటి వ్యక్తులను పార్టీలో పెట్టుకుంటే బీజేపీకి రాష్ట్రంలో డిపాజిట్లు కూడా రావని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో కుల, మత, పార్టీలకు అతీతంగా సీఎం వైఎస్ జగన్ పాలన చేస్తున్నారని మల్లాది విష్ణు తెలిపారు. కానీ చంద్రబాబుతో కలిసి ఆలయాలను కూల్చిన చరిత్ర బీజేపీదేనని విమర్శించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్రలు మానుకోవాలని బీజేపీ నేతలకు హితవు పలికారు. విభజన హామీల అమలుకు గడువు రెండేళ్లే ఉన్నందున ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, వెనకబడిన జిల్లాల గ్రాంటు ఇలా పలు అంశాల్లో రాష్ట్రం పట్ల కేంద్రం సుముఖత వ్యక్తం చేసేలా.. రాష్ట్ర బీజేపీ నాయకత్వం చొరవ చూపాలని కోరారు. అంతేగానీ బాధ్యతల నుంచి వైదొలగుతూ.. మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు.