-పోలీస్ శాఖ పనితీరు భేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేవాలయాల జోలికి వస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే మల్లాది విష్ణు హెచ్చరించారు. పాయకాపురంలోని రాధానగర్ సంతోషిమాత ఆలయం నందు 18 కిలోల అమ్మవారి పంచలోహ విగ్రహ చోరీ కేసును పోలీసులు ఛేదించిన నేపథ్యంలో స్థానిక నాయకులు అలంపూర్ విజయ్ తో కలిసి శుక్రవారం ఆయన ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పాలక మండలి అధ్యక్షుడు చిన్ని చిట్టిబాబును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకుని సీసీ కెమెరాల సాయంతో 12 గంటల్లోనే నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీస్ శాఖను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయ పరిసరాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేయాలని పాలకమండలి సభ్యులకు సూచించారు. ఆలయాల పరిరక్షణ, పవిత్రతను కాపాడేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా మల్లాది విష్ణు మరోసారి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, నాయకులు వీరబాబు, బోరా బుజ్జి, రామిరెడ్డి, హైమావతి, బాబ్జి, ఖాదర్ బి, శివపార్వతి, శ్రీను తదితరులు ఉన్నారు.