అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 31వ తేదీన హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నవివిధ పధకాల లబ్దిదారులతో నేరుగా మాట్లాడనున్నారు.ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై శుక్రవారం ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ మాట్లాడుతూ ఇందుకు సంబంధించి రాష్ట్ర,జిల్లా స్థాయిల్లోను,కృషి విజ్ణాన కేంద్రాల స్థాయిల్లోను నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ఆయన సిఎస్ లకు తగిన ఆదేశాలు జారీ చేశారు.అదే విధంగా పరిశ్రమల ప్రోత్సాహం,అంతర్గత వాణిజ్యం పెంపొందించేందుకు వీలుగా డీక్రీమినలైజేషన్ అఫ్ ఎగ్జిస్టింగ్ యాక్ట్స్,రూల్స్ గురించి,అగ్రిస్టాక్ ఫర్ డిజిటల్ అగ్రిమిషన్ కు సంబంధించి రైతుల డేటాబేస్ రూపకల్పనకు సంబంధించిన అంశాలపై కూడా ఆయన మాట్లాడారు.ముఖ్యంగా సాట్యురేషన్ విధానంలో అన్ని పధకాలు ప్రతి లబ్దిదారునికి ఏవిధంగా చేరాలి,ఆయా పధకాలను ఏవిధంగా మరింత సమర్ధవంతంగా అమలు చేయడం ద్వారా ప్రజల జీవన విధానాన్ని ఏవిధంగా మరింత మెరుగుపర్చాలనే దానిపై ప్రధాని సూచనలు సలహాలను తీసుకుంటారని కెబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ చెప్పారు.
ముఖ్యంగా పిఎం ఆవాస్ యోజన,పియం కిసాన్ సమ్మాన్ నిధి,పియం ఉజ్వల యోజన,పోషణ్ అభియాన్,పియం మాతృ వందన యోజన,స్వచ్ఛభారత్ మిషన్,జల్ జీవన్ మిషన్ మరియు అమృత్,పియం స్వానిధి పధకం,ఒన్ నేషన్ ఒన్ రేషన్ కార్డు మరియు పియం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన,ఆయుస్మాన్ భారత్,పియం జన్ ఆరోగ్య యోజన, ఆయుస్మాన్ భారత్ హెల్తు మరియు వెల్ నెస్ కేంద్రాలు,పియం ముద్రా యోజన తదితర పధకాల లబ్దిదారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నేరుగా మాట్లాడతారని చెప్పారు.జిల్లా స్థాయిల్లో జరిగే కార్యక్రమాల్లో కేంద్ర రాష్ట్ర మంత్రులు,ఎంపి,ఎంఎల్ఏ,ఎంఎల్సి,మేయర్లు,జిల్లా పరిషత్ అధ్యక్షులు,స్వాతంత్ర్య సమరయోధులు వారి కుటుంబ సభ్యులు,వివిధ పధకాలకు సంబంధించి ప్రతి పధకానికి కనీసం 10 మంది లబ్దిదారులు,పంచాయితీరాజ్ సంస్థలకు చెందిన వారు,జిల్లాకు సంబంధించిన ప్రముఖులను,బ్యాంకులు,పౌర సంఘాలకు చెందిన ప్రతనిధులు సహా కనీసం 500 మంది వరకూ భాగస్వాములను చేయాలని రాజీవ్ గౌబ సిఎస్ లకు సూచించారు.
జిల్లా స్థాయిలో జరిగే కార్యక్రమం పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో ఒక నోడలు అధికారిని నియమించాలని,జిల్లాలకు అవసరమైన లాజిస్టిక్ సహాయం అందించేందుకు రాష్ట్ర స్థాయి నుండి తగిన సహాయ సహకారాలను అందించాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సిఎస్ లను ఆదేశించారు.అదే విధంగా హర్ ఘర్ జెండా విధానం కింద జాతీయ జెండా ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా అన్ని ప్రభుత్వ భవనాలు,సంస్థలు పాఠశాలలు, కళాశాలలు అన్నిటి పైనా ఆరోజు జాతీయ జెండాను ఎగురవేయాలని చెప్పారు.ప్రధానిచే నిర్వహించబడే ఈకార్యక్రమాన్నిదేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లో విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సిఎస్ లను ఆదేశించారు.
ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈకార్యక్రమానికి సంబంధించి మూడు జిల్లాలను విజయనగరం,కృష్ణా, చిత్తూరు జిల్లాలను ఎంపిక చేశామని వివరించారు.ఈమూడు జిల్లాల్లో ప్రధాన మంత్రితో ఇంటరాక్ట్ అయ్యేందుకు ముగ్గురు లబ్దిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో 2 లక్షల 50 వేల మంది గ్రామ,వాలంటీర్లు ఉన్నారని ఒక్కొక్కరూ జాతీయ జెండాతో కలిగి 50 గృహాలను కవర్ చేస్తారని చెప్పారు.అలాగే 15వేల వరకూ గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయని వాటి ద్వారా ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నట్టు సిఎస్ డా.సమీర్ శర్మ వివరించారు.అందరు ప్రజాప్రతినిధులు,అన్ని శాఖల అధికారులు,సిబ్బంది సహా స్వయం సహాయక బృందాలు,పరిశ్రమలు,షాపులు అందరినీ దీనిలో భాగస్వాములను చేసి విజయవంతం చేయనున్నట్టు కేబినెట్ కార్యదర్శికి సిఎస్ డా.సమీర్ శర్మ వివరించారు.
ఈ వీడియో సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్ కుమార్,అజయ్ జైన్,బి.రాజశేఖర్, ముఖ్య కార్యదర్శులు శశిభూషణ్ కుమార్,హారిష్ కుమార్, రవిచంద్ర, ఆర్.ముత్యాలరాజు,బాబు ఎ తదితర కార్యదర్శులు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
సోమవారం డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 30వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల …