విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ… దాదాపు రూ.8,480 కోట్ల వ్యయంతో 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఇవాళ 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ప్రారంభోత్సవం జరిగింది. విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం విజయనగరం ప్రభుత్వ వైద్యకళాశాల ప్రాంగణం నుంచి వర్చువల్‌గా రాజమహేంద్రవరం, ఏలూరు, నంద్యాల, మచిలీపట్నంలలో 4 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సీఎం వైయస్.జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్ధులనుద్దేశించి సీఎం వైయస్.జగన్ మాట్లాడుతూ ..:
గొప్ప వైద్యులుగా ఎదగాలి…
ఈ రోజు దేవుడి దయతో మంచి కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నాం. అందులో 5 మెడికల్ కాలేజీలలో ఇవాళ విద్యార్ధులు అడ్మిషన్ తీసుకున్నారు. ఈ మెడికల్ కాలేజీల నుంచి మీరు నేర్చుకునే చదువు ద్వారా.. మీకు వచ్చే శిక్షణ, ఆ తర్వాత మీరు చేసే సేవ ద్వారా రాబోయే రోజుల్లో మీరందరూ మంచి పేరు తెచ్చుకుని గొప్ప వైద్యులుగా, గొప్ప మనుషులుగా ఎదుగుతారని మనసారా ఆకాంక్షిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.
ఇవాళ 17 మెడికల్ కాలేజీ పనులు మొదలుపెడితే అందులో 5 మెడికల్ కాలేజీలు విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో మనం మొదలుపెట్టిన కార్యక్రమాలు వేగంగా పూరై్త ఇవాళ తొలి ఏడాది ప్రవేశాలు కూడా జరుపుకున్నాయి. మనం చేస్తున్న ఈ కార్యక్రమాలలో 5 మెడికల్ కాలేజీలతో పాటు వచ్చే ఏడాది మరో 5 కాలేజీలను కూడా అడ్మిషన్ స్ధాయిలోకి తీసుకువచ్చే కార్యక్రమం చేస్తాం. ఆ మరుసటి ఏడాది మరో 7 కాలేజీలు కూడా అందుబాటులోకి వస్తాయి. మొత్తంగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం.
టెరిషరీ కేర్ సేవలే లక్ష్యంగా…
ప్రతి పార్లమెంటును ఒక జిల్లాగా చేయడమే కాకుండా.. ప్రతి పార్లమెంటుస్ధాయిలోనూ ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల టెరిషరీ కేర్ సేవలును ప్రతి పార్లమెంటు స్ధాయిలోకి తీసుకునిపోగలుగుతాం. ఎందుకంటే ఎప్పుడైతే మంచి మెడికల్ కాలేజీ అవైలబుల్‌గా ఉంటుందో అప్పుడు ఆ మెడికల్ కాలేజీతో పాటు ప్రొఫెసర్లుగానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్లుగానీ వీళ్లందరూ అందుబాటులో ఉండటం వంటి ఒక గొప్ప మార్పు టెరిషరీ కేర్‌లో జరుగుతుంది.
టెరిషరీ కేర్ పెరగడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఇది ఒక ఎత్తయితే వేల మంది పిల్లలను మంచి డాక్టర్లుగా తయారు చేసే గొప్ప ఇన్‌స్టిట్యూషన్స్‌ను కూడా రాష్ట్రంలో క్రియేట్ చేయగలుగుతున్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు 11 మాత్రమే ఉన్నాయి.
అటువంటిది కేవలం ఈ నాలుగు సంవత్సరాల కాలంలో దేవుడి దయతో 13 జిల్లాలను 26 జిల్లాలుగా డీసెంట్రలైజ్ చేయగలిగాం.
అది కాకుండా మరో 17 మెడికల్ కాలేజీలను యాడ్‌చేసి 28 మెడికల్ కాలేజీలు ఏర్పాటు దిశగా అడుగులు వేగంగా వేస్తున్నాం.
రూ.8,480 కోట్లఖర్చుతో 17 కొత్త మెడికల్ కాలేజీలు
ఈ 17 మెడికల్ కాలేజీలను కట్టడానికి దాదాపు రూ.8,480 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ కాలేజీల వల్ల కొత్తగా మరో 2,250 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 2,185 అవైలబుల్‌గా ఉంటే… ఈ 17 మెడికల్ కాలేజీలు రావడంతో ఈ ఎంబీబీఎస్ సీట్లు ఏకంగా 4,735కు పెరుగుతాయి. ఇవే కాక ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీలన్నింటిలోనూ సదుపాయాలన్నీ అప్‌గ్రేడ్ చేయగలిగాం.
జీరో వేకెన్సీ పాలసీ…
కేవలం మౌలిక సదుపాయాల కల్పన ఒక్కటే కాకుండా… జీరో వేకెన్సీ పాలసీ తీసుకుని… ఖాళీలన్నింటినీ భర్తీ చేయడం వల్ల.. ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 609 కొత్త పీజీ సీట్లు అందుబాటులోకి రాగలిగాయి. ఈ 17 మెడికల్ కాలేజీలు పూరై్తన వెంటనే భవిష్యత్తులో మరో 2,737 పీజీ సీట్లు కూడా వీటి ద్వారా అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ ఎందుకు ఇంతగా చెప్పాల్సి వస్తోందంటే, మీరంతా కూడా మంచి డాక్టర్లు కావాలి, మీరంతా కూడా ఆంధ్రరాష్ట్ర ప్రజలకు ఇంకా ఎక్కువగా ఉపయోగపడే పరిస్థితి రావాలని అన్నది నా కోరిక. యాజ్ ఎ లీడర్స్, విజనరీస్, దిస్ ఈజ్ అవర్ డిజైర్ టు సీయూ దేర్.
5 కాలేజీల్లో 750 సీట్లు…
ఈరోజు ప్రారంభం అవుతున్న విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఈ 5 మెడికల్ కాలేజీల్లో దాదాపు 750 ఎంబీబీఎస్ సీట్లతో పిల్లలు డాక్టర్లు కాబోతున్నారు. అదే విధంగా రానున్న సంవత్సరం పాడేరు, పులివెందుల, మార్కాపురం, మదనపల్లె, ఆదోని లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. 2024–25లో మరో 750 మెడికల్ సీట్లు వస్తాయి. ఆ తర్వాత గిరిజన మరియు సుదూరంగా ఉన్న ప్రాంతాల్లో ఏరియాల్లో టెరిషరీ కేర్ దొరకడం కష్టం అనే పరిస్తితి ఉన్న పార్వతీపురం, నర్సీపట్నం లాంటి చోట్ల కూడా 2025–26లో మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి. దాదాపుగా ఆ 7 మెడికల్ కాలేజీలలో కూడా 1050 సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
నర్సింగ్ కాలేజీల అభివృద్ధికీ…
ఈ ఎంబీబీఎస్, పీజీ మెడికల్ కాలేజీల్లో సీట్లు మాత్రమే కాకుండా గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలను డెవలప్ చేస్తున్నాం. 2019 వరకు దాదాపు 1090 నర్సింగ్‌సీట్లు ఉంటే ఇప్పుడు మనం మరో 18 నర్సింగ్ కాలేజీలను తీసుకొస్తున్నాం. వీటి ద్వారా మరో 1200 నర్సింగ్ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి. మొత్తంగా 2290 నర్సింగ్‌సీట్లు అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు ఇప్పటికే ఉన్న 11 మెడికల్ కాలేజీలకు సంబంధించి… ప్రతి కాలేజీలోనూ ఎన్‌ఏబీహెచ్, ఎన్‌ఎంసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కాలేజీలను అన్నింటినీ నాడు–నేడు ద్వారా అప్‌గ్రేడ్ చేస్తున్నాం. ఈ 11 మెడికల్ కాలేజీల్లో నాడు–నేడు కార్యక్రమాలు అన్నింటి మీద దాదాపు రూ.3,820 కోట్లు వెచ్చిస్తున్నాం.
ప్రివెంటివ్ కేర్‌లో కొత్త అధ్యాయం..
మన నాలుగేళ్ల పరిపాలనలో గమనించినట్లయితే…
ఒక ప్రణాళికాబద్ధంగా గ్రామ స్థాయి నుంచి మార్పులు తీసుకొస్తున్నాం. ఒకపక్క క్యూరేటివ్ ట్రీట్‌మెంట్ ఎంత అవసరమో, ప్రివెంటివ్ కేర్ కూడా అంతే అవసరం. ప్రివెంటివ్ కేర్‌లో కూడా దేశానికే మార్గదర్శకంగా నిలబడే విధంగా అడుగులు పడటం జరిగింది. ఇందులో ఏ రకమైన మార్పులు తెచ్చామో చూస్తే… ఇవాళ ప్రివెంటివ్ కేర్‌లో ఎప్పుడూ చూడని అడుగులుపడ్డాయి. దాదాపు 10,032 విలేజ్ క్లినిక్స్ ఏర్పాటయ్యాయి. ఆ విలేజ్ క్లినిక్స్‌లో సీహెచ్‌వో, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్ ఉంటారు. గ్రామస్థాయిలో 105 రకాల మందులు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. 14 రకాల డయోగ్నస్టిక్ టెస్టులు చేస్తారు.
పట్టణ ప్రాంతాలకు సంబంధించి మరో 542 అర్బన్ క్లినిక్స్ తీసుకొచ్చాం. ఈ విలేజ్ క్లినిక్స్‌ను ప్రివెంటివ్ కేర్ దిశగా అడుగులు వేయిస్తున్నాం. ప్రతి మండలానికీ కనీసం 2 పీహెచ్‌సీలు ఉండేటట్టుగా చేశాం. ఒక్కో పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు ఉండేట్లు చేస్తున్నాం. ప్రతి మండలంలోనూ నలుగురు డాక్టర్లు, ప్రతి పీహెచ్‌సీలోనూ ఒక 104 వాహనం ఉండేట్లు చేస్తున్నాం. ఈ నలుగు డాక్టర్లు ప్రతి నెలా గ్రామానికి 2 సార్లు వెళ్లేటట్లు చేస్తున్నాం. ఒక డాక్టరు పీహెచ్‌సీలో ఉంటే మరో డాక్టరు గ్రామాలకు వెళ్తారు. దీని వల్ల 6 నెలల్లో ఎవరికి ఏ రోగముంది, ఎవరికి బీపీ, షుగర్, ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయని పూర్తిగా చెప్పే ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చాం. ఇది ప్రివెంటివ్ కేర్‌లో తీసుకున్న చాలా పెద్ద మార్పు.
గవర్నమెంట్ ఆస్పత్రుల్లో మందులు తీసుకుంటే నయం కాదు అని చాలా మంది అనుకుంటారు. కానీ ఈరోజు అన్ని గవర్నమెంట్ ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్‌వో, జీఎంపీ మందులు మాత్రమే ఆంధ్రరాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి.
మరింత విస్తరించిన ఆరోగ్యశ్రీ…
మన ప్రభుత్వం రాకమునుపు ఆరోగ్యశ్రీ సేవలు నామమాత్రంగా ఉండేవి. గతంలో 1050 ప్రొసీజర్లు మాత్రమే ఉంటే, ఈరోజు 3,255 ప్రొసీజర్లకు విస్తరించాయి. అన్ని రకాల క్యాన్సర్ దగ్గర నుంచి మొదలు కాక్లియర్ ఇంప్లాంట్‌దాకా ఆరోగ్యశ్రీలో కవర్ అవుతున్నాయి. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే అది ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావాలి, తేవాలన్న తపన, తాపత్రయంతో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరిస్తున్నాం.
గతంలో ఆరోగ్యశ్రీ ఎంపానెల్ 900 హాస్పిటల్స్ ఉంటే, ఈరోజు 2285కు విస్తరించాయి. గతంలో ఆరోగ్యశ్రీ బడ్జెట్ రూ.1100 కోట్లు కూడా లేని పరిస్థితి ఉంటే, ఈరోజు రూ.3,600 కోట్లకు అందుతోంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా… ప్రతి మండలానికి ఒక 108, రెండు 104 వాహనాలు ఉండేట్లుగా దాదాపు 1,514 కొత్త వాహనాలు కొనుగోలు చేశాం. తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌తో కూడా కలుపుకుంటే 2,204 అంబులెన్స్ వాహనాలు రాష్ట్రంలో తిరుగుతున్నాయి. ఇలా ఏ రాష్ట్రంలోనూ తిరగడం లేదు.
మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే… రాష్ట్రంలో ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మనం రిక్రూట్ చేసిన హెల్త్ డిపార్ట్ మెంట్ స్టాఫ్ 53,126 మంది.
నో వేకెన్సీ పాలసీ…
స్పెషలిస్టు డాక్టర్లుకు సంబంధించి అవైలబులిటీ తీసుకుంటే, నేషనల్ యావరేజ్ 61 శాతం వేకెంట్ ఉంటే… స్టేట్‌యావరేజ్ వేకెంట్ కేవలం 3.96 శాతం మాత్రమే. నో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి.. స్పెషల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేసి.. స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించాం. ఖాళీలు ఉంటే వెంటనే భర్తీ చేయాలని వెంటపడి మరి భర్తీ చేస్తున్నాం.
జాతీయ స్థాయిలో ప్రభుత్వాస్పత్రుల్లో నర్సుల పోస్టుల్లో వేకెన్సీ 27 శాతం ఉంటే… అదే మన రాష్ట్రంలో మాత్రం జీరో. జాతీయ స్థాయిలో గవర్నమెంటు ఆసుపత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్ల వేకెన్సీలు 33 శాతం ఉంటే.. మన రాష్ట్రంలో మాత్రం జీరో వేకెన్సీ. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. మనం ఏ స్ధాయిలో ఆరోగ్యరంగం మీద ధ్యాస పెట్టామో తెలుసుకోవాలి. ఇక్కడ నుంచి మంచి డాక్టర్లు రావాలి.
మంచి పీజీ స్టూడెంట్లు రావాలి. మంచి మనసు రావాలి, మీరు కూడా పేదవాళ్లకు ఉపయోగపడే పరిస్థితి రావాలన్న ఉద్దేశ్యంతో ఇవన్నీ చేస్తున్నాం.
ఇప్పటి వరకు బటన్ నొక్కితే నేరుగా డీబీటీ పద్ధతిలో రూ. 2.35 లక్షల కోట్లు పేద ప్రజల ఖాతాల్లోకి నేరుగా వేయగలిగాం. ఎక్కడా లంచాలు, వివక్షకు చోటు లేకుండా చేయగలిగాం. ఇంటి తలుపు తట్టి పెన్షన్‌ను ప్రతి గడపకూ తీసుకొని పోగలిగాం. ఇంటి తలుపుతట్టి రేషన్ కార్డు, రేషన్ బియ్యం, ప్రతి గడప ముంగిటకు చేర్చగలిగాం.
ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి ఇంటి స్థలం లేని వారు ఉన్నారా ? అని వెతికి, అప్లికేషన్‌పెట్టించి 30 లక్షల ఇంటి స్థలాలను పేదవాళ్లకు ఇవ్వగలిగాం. అందులో వేగంగా 22 లక్షల ఇళ్లు నిర్మాణం కూడా జరుగుతోంది. ఎవరికి ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఇంటింటికీ వెళ్లి జల్లెడ పట్టి అడిగి మరీ వాళ్ల ప్రతీ అవసరాలు తీరుస్తున్నాం. మొన్నటి జగనన్న సురక్షలో 98 లక్షల సర్టిఫికెట్లు అందజేశాం.
అందరికీ ఆరోగ్యం – జగనన్న ఆరోగ్య సురక్ష..
ఈరోజు ఈ కార్యక్రమంతో పాటు ఇదే దిశగా అడుగులు వేస్తూ… ఇంకో మంచి కార్యక్రమం చేస్తున్నాం. జగనన్న ఆరోగ్య సురక్ష అని ఈరోజు ప్రారంభించాం. ప్రతి ఇంటì కీ వెళ్లి జల్లెడ పట్టి ఎవరికి ఏ రకమైనా సమస్య ఉన్నా 7 రకాలు పరీక్షలు చేస్తూ… ప్రతి ఇంటికి వెళ్తున్నాం. ఐదు దశలలో జరిగే ఈ కార్యక్రమంలో నాలుగో దశలో హెల్త్ క్యాంపు పెడుతున్నాం. సెప్టెంబరు 30న తొలి హెల్త్ క్యాంపు నిర్వహించబోతున్నాం. ఆ తర్వాత 45 రోజుల పాటు 45 రోజులు రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ హెల్త్‌క్యాంపులు విస్తరించి పూర్తి చేస్తాం. గ్రామం మొత్తం మ్యాపింగ్ అవుతుంది. ప్రతి ఇంట్లో ఏ రకమైన సమస్య ఉన్నా వాళ్లకు ఫ్రీగా టెస్టులు చేస్తాం. మందులు ఇవ్వబోతున్నాం. ఆ తర్వాత హ్యాండ్ హోల్డింగ్ చేయబోతున్నాం. ఇది చాలా పెద్ద మార్పు. విలేజ్ క్లినిక్స్ ద్వారా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా అడుగులు వేయబోతున్నాం. మీ అందరి సహాయ సహకారాలు రావాలి, కావాలి అని మనస్పూర్తిగా అడుగుతున్నాను.
వైద్య దేవతలు…
కొన్ని మాటలు ఎప్పుడూ కూడా నా మనసుకు తడుతుంటాయి.
నాట్ ఆల్ ఏంజిల్స్ హావ్ వింగ్స్, సమ్ హ్యావ్ స్టెతస్కోప్స్. కీప్ దిస్ ఇన్‌మైండ్. ఇది ఇక్కడే రాసి సంతకం కూడా పెట్టాను.
మీరందరూ యువత. రానున్న ఐదేళ్లలో మీరు వైద్యులు కాబోతున్నారు. దేవుడి దయతో మంచి పోస్ట్ గ్రాడ్యేయేట్ విద్యార్ధులై.. ఇంకా మంచి డాక్టర్లు అవుతారు. ప్రజలకు మీరు చేయబోయే కార్యక్రమాలకు సంబంధించి మీ మీద చాలా ఆశలు ఉన్నాయి. ఈ మాటలను మీ మైండ్‌లో గుర్తుపెట్టుకొండి. దేశంలోనే మీరు మంచి వైద్యులుగా తయారవుతాని నేను నమ్ముతున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ టూ యూ అని సీఎం ప్రసంగం ముగించారు.
ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పలువులు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.