Breaking News

ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాం..

-తుపాను ప్రభావం తగ్గిన వెంటనే ఎన్యుమరేషన్
-కలెక్టర్ పి.రాజాబాబు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో మిచౌంగ్ తుపాన్ కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకుండా అన్ని విధాలుగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు పేర్కొన్నారు.

మంగళవారం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి మాట్లాడుతూ మిచౌంగ్ తుపాను ప్రభావిత మండలాలైన నాగాయలంక, కృత్తివెన్ను, కోడూరు, చల్లపల్లి, మచిలీపట్నం, బంటుమిల్లి, అవనిగడ్డ, మోపిదేవి మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. తుపాను పరిస్థితులను పర్యవేక్షించేందుకు మండలాలకు నియమించిన ప్రత్యేక అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారని, ఆయా మండలాల పరిధిలో తుపాన్ షెల్టర్లు, పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తించి అవసరమైన వసతులను ఏర్పాటు చేసామని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను, శిధిలావస్థలో ఉన్న ఇళ్ళు, గుడిసెల్లో నివసిస్తున్న ప్రజలను దగ్గరలోని తుపాను షెల్టర్లు, పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందన్నారు.

ఇప్పటివరకు ఆయా మండలాల్లో 67 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, 3,305 మందిని తరలించామని తెలుపుతూ, నాగాయలంక మండల పరిధిలోని 16 పునరావాస కేంద్రాలలో 758 మంది, కోడూరు మండల పరిధిలో 6 పునరావాస కేంద్రాలలో 697 మంది, మచిలీపట్నం పరిధిలో 25 కేంద్రాలలో 1472 మంది, కృత్తివెన్ను పరిధిలో 5 కేంద్రాలలో 83 మంది, అవనిగడ్డ పరిధిలో 4 కేంద్రాలలో 74 మంది, మోపిదేవి పరిధిలో 3 కేంద్రాలలో 12 మంది, బంటుమిల్లి పరిధిలో 4 కేంద్రాలలో 132 మంది, చల్లపల్లి మండల పరిధిలో 4 కేంద్రాలలో 77 మంది ప్రజలను లోతట్టు ప్రాంతాల నుంచి సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి ఉదయం పూట అల్పాహారం, పాలు, మధ్యాహ్నం, రాత్రికి భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. పరిస్థితులను బట్టి ఇంకా 8 వేల మందికి పైగా ప్రజలను పునరావాస కేంద్రాలకు ఈ రోజు సాయంత్రం తరలించే అవకాశం ఉందని, అందుకు తగ్గట్లుగా జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని అన్నారు. ఇప్పటికే ఆయా మండలాల్లోని కొన్ని పునరావాస కేంద్రాలను జిల్లా ఎస్పీతో కలిసి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందన్నారు.

పునరావాస కేంద్రాల వద్ద ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, ఆహారం, మంచినీరు, విద్యుత్ సౌకర్యం, టార్చి లైట్లు, రెయిన్ కోట్లు, జనరేటర్లతో పాటు అన్ని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అంతేకాకుండా కావలసిన మందులతో వైద్య శిబిరాలు అక్కడే ఏర్పాటు చేశామన్నారు.

అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు గ్రామాల్లోని విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ల వద్ద షిఫ్టుల పద్ధతిలో 24 గంటలూ పని చేసే విధంగా వైద్యులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు ఇతర వైద్య ఆరోగ్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విస్తృతంగా కురుస్తున్న వర్షాలకు నీరు చుట్టుముట్టిన ఇళ్లలోని కుటుంబాల వారికి ఒక్కో కుటుంబానికి25 కిలోల బియ్యం, ఒక కిలో చొప్పున కందిపప్పు ఉల్లిపాయలు, వంటనూనె, బంగాళాదుంపలు ప్రజలకు అందిస్తున్నామన్నారు.

అదేవిధంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.10 వేలు చొప్పున ఆయా కుటుంబాలకు, రూ.2,500ల చొప్పున పునరావాస కేంద్రాల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వారికి అందించనున్నట్లు ఆయన తెలిపారు.

మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేటకు సముద్రంలోకి వెళ్లకుండా నియంత్రించామని, వారి పడవలు దెబ్బ తినకుండా సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకునేలా ఏర్పాటు చేశామన్నారు. వారికి కావలసిన ఆహారము, మంచినీరు అన్నిటిని అందించి అన్ని విధాల ఆదుకుంటున్నామన్నారు.

తుపాను ప్రభావం తగ్గిన వెంటనే పంట నష్టంపై ఎన్యుమరేషన్ చేపట్టి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.

జిల్లాలోని తుపాను పరిస్థితులపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఫోన్ కాల్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను ఆరా తీస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

పరిస్థితులకు అనుగుణంగా విద్యుత్ ను నియంత్రిస్తూ, విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా రహదారుల్లో పడిపోయిన చెట్లను తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం, విద్యుత్ స్తంభాలకు అనుకుని ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడంతో పాటు పరిస్థితులను నిత్యం పర్యవేక్షించేలా సంబంధిత అధికారులకు సూచించడం జరిగిందన్నారు.

కలెక్టరేట్ తో సహా అన్ని ఆర్డీవోలు, తహసిల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ విభాగాలు ఏర్పాటు చేసి నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకున్నామని,
కలెక్టరేట్లో 08672 252572, 252000 నంబర్ లో తుఫాను సమాచారం గానీ సహాయక చర్యల కోసం గానీ సంప్రదించవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *