Breaking News

ఇంధనశాఖ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష

-ఈ ఏడాదిలో అదనంగా 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం
– పీక్ లోడ్ అవసరాల కోసం పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లు
– రైతులకు ఉచిత విద్యుత్ అందించడంలో ఎపి ముందంజ
– సెకీ ద్వారా 7200 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్ళకు ఒప్పందం
– 30 ఏళ్ళ పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ భరోసా
– వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా
– ఫిబ్రవరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కనెక్షన్ దరఖాస్తుల పరిష్కారం
– పెండింగ్ లో ఉన్న సబ్ స్టేషన్లను వెంటనే పూర్తి చేయాలి
– పంపిణీ నష్టాలను మరింతగా తగ్గించుకునేందుకు చర్యలు
– జగనన్న కాలనీల్లో విద్యుద్దీకరణకు ప్రాధాన్యత
– సబ్ స్టేషన్ స్థాయి కమిటీల నుంచి ఫీడ్ బ్యాక్
– టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై తక్షణ స్పందన
-మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులకు వ్యవసాయం కోసం ఉచిత విద్యుత్ ను అందించడంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ మందంజలో ఉందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పగటిపూట తొమ్మిది గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ ను అందించడం ద్వారా రైతులకు ఈ ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం ఇంధనశాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

సీఎం వైయస్ జగన్ పాలనలో ఇంధనశాఖను బలోపేతం చేశాం. ఈ ఏడాది కృష్ణపట్నం, ఎన్టిటిపిఎస్ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 1600 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకురాగలిగాం. ఇందుకోసం చిత్తశుద్దితో పనిచేసిన జెన్కో అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నాం. అలాగే పీక్ లోడ్ అవసరాల కోసం పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ ల ద్వారా అదనపు విద్యుత్ ఉత్పత్తికి కృషి చేస్తున్నాం. ఇవి వినియోగంలోకి వస్తే రాష్ట్ర అవసరాలు తీరడంతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా విద్యుత్ ను విక్రయించే సామర్థ్యంను సాధిస్తాం.

అలాగే వ్యవసాయంకు పగటిపూట తొమ్మిది గంటలు నాణ్యమైన విద్యుత్ ను అందించాలన్న సీఎం వైయస్ జగన్ సంకల్పంలో భాగంగా తక్కువ ఉత్పత్తి వ్యయం అయ్యే సోలార్ విద్యుత్ పై దృష్టి సారించాం. ఇందుకోసం కేంద్రప్రభుత్వ సంస్థ సెకీతో ఒప్పందం చేసుకున్నాం. మొత్తం 7200 మెగావాట్ల విద్యుత్ ను, యూనిట్ రూ.2.49 ధరతో సెకీ నుంచి కొనుగోలు చేసి, రైతులకు ఉచితంగా సరఫరా చేయనున్నాం. దీనివల్ల ప్రభుత్వంపై కూడా భారం తగ్గుతుంది.

సీఎం ఇటీవలే 13 ట్రాన్స్ కో సబ్ స్టేషన్లను వర్చ్యువల్ గా ప్రారంభించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో ఎక్కడా ఇబ్బందులు ఏర్పడకూడదనే లక్ష్యంతో ఇంధన శాఖ అన్ని చర్యలు తీసుకుంటోంది, అవసరమైన చోట్ల కొత్త సబ్ స్టేషన్లను నిర్మిస్తోంది. మొత్తంగా ఈ నాలుగేళ్ళలోనే ఇంధనశాఖ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని క్రమంగా పెంచుకోవడంలో, పగటిపూట రైతులకు తొమ్మిది గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ను అందించడంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది.

వచ్చే ఏడాది నుంచి పోలవరం లో ఒక యూనిట్ ద్వారా హైడల్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. హైడ్రోజన్, సోలార్, విండ్ పవర్ ఉత్పత్తికి ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. ఇప్పటికే వ్యవసాయేతర భూములను ఎకరానికి ఏటా రూ.30వేలు చెల్లిస్తూ, ఆ భూముల్లో సోలార్, విండ్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నాం. దీనిని రాబోయే రోజుల్లో మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

రాష్ట్రంలో జగనన్న కాలనీలకు విద్యుద్దీకరణ, వ్యవసాయ కనెక్షన్ దరఖాస్తుల పూర్తి పరిష్కారంకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పేదలకు గృహవసతి కల్పించేందుకు నిర్ధేశించిన జగనన్న కాలనీలకు విద్యుద్దీకరణ పనులను వేగవంతం చేయాలని అన్నారు. ఆయా కాలనీల్లో నిర్మాణ పనులకు ప్రోత్సాహం కలిగించేలా విద్యుత్ వసతిని అందించడంలో ఎటువంటి అలసత్వం చూపించకూడదని అన్నారు.

రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి రైతుకు ఉచితంగా వ్యవసాయ విద్యుత్ ను అందించాలన్న సీఎం వైయస్ జగన్ లక్ష్యంకు అనుగుణంగా రైతుల నుంచి వచ్చే దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఉచిత విద్యుత్ కనెక్షన్ ల కోసం వస్తున్న దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా, వాటిని పరిశీలించి కనెక్షన్ లను జారీ చేయాలని కోరారు. మెరుగైన విద్యుత్ సరఫరా కోసం స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై కూడా రైతుల్లో సానుకూలత వ్యక్తమవుతోందని అన్నారు. దీనిని ప్రతిపక్షాలు రాజకీయం చేయాలని చూస్తున్నా, రైతులు మాత్రం వాస్తవాలను గ్రహించి అర్థం చేసుకుంటున్నారని అన్నారు.

డిస్కంల పరిధిలో పంపిణీ నష్టాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే బకాయిల వసూళ్ళపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. న్యాయపరమైన వివాదాల పరిష్కారానికి జిల్లా, రాష్ట్ర స్థాయిలో లీగల్ టీంలను ఏర్పాటు చేయాలని కోరారు.

క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు సబ్ స్టేషన్ల స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలతో సమావేశాలు నిర్వహించాలని కోరారు. ఈ కమిటీల్లోని సభ్యుల నుంచి వచ్చే సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకోవాలి. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వినియోగదారుల నుంచి వచ్చే సమస్యలపై వెంటన స్పందించి చర్యలు తీసుకోవాలి.

నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ఇప్పటికే కేటాయించిన సబ్ స్టేషన్ల నిర్మాణంను వేగవంతం చేయాలి. ఎక్కడైనా స్థలం సమస్య ఉంటే, సంబంధిత కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని వాటిని పరిష్కరించుకోవాలి. స్థల వివాదాలు ఉంటే ప్రత్యామ్నాయ ప్రాంతాలను పరిశీలించాలి. నిర్మాణంలో ఉన్న సబ్ స్టేషన్ల నిర్మాణం రెండు నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు చేయాలి.

వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వారికి సేవలను అందుబాటులోకి తీసుకురావాలి. విద్యుత్ భద్రతపై సిబ్బందిలో అవగాహన పెంచాలి. పోల్ టు పోల్ సర్వే ద్వారా రాష్ట్రంలోని మొత్తం నెట్ వర్క్ లో ఎక్కడా సమస్య లేకుండా, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ సమావేశంలో జెన్కో ఎండి, ట్రాన్స్ కో జెఎండి కెవిఎన్ చక్రధర్ బాబు, డిస్కం సిఎండిలు ఐ.పృథ్వితేజ్, కె.సంతోష్ రావు, పద్మాజనార్థన్ రెడ్డి, ఇంధనశాఖ సంయుక్త కార్యదర్శి బిఎవి కుమార్ రెడ్డి, ట్రాన్స్ కో , జెన్ కో డైరెక్టర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *