-రీ పోల్, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
గత సార్వత్రిక ఎన్నికలు 2019 నందు రీపోల్ జరిగిన చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ తనిఖీ చేసి రీ పోల్ కు కారణాలు తెలుసుకుని, ఈ దఫా సార్వత్రిక ఎన్నికలు 2024 నందు ఎట్టి పరిస్థితుల్లో రీ పోల్, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల నిర్వహణకు ఈఆర్ఓ, ఎఈఆర్ఓ లు, సెక్టోరల్ అధికారులు, పోలీస్ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ఎన్నికల ప్రక్రియలో విఘాతం కలిగించే వారిపై ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చర్యలు తప్పవని హెచ్చరించారు.
గురువారం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రామచంద్రా పురం మండలంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో రీపోల్ జరిగిన పలు పోలింగ్ కేంద్రాలను వెంకట్రామపురం, కమ్మపల్లి, కొత్త కండ్రిగ, కుప్పం బాదూరు, సి. కాలేపల్లి, నిలువు రాళ్ల కమ్మపల్లి గ్రామాల్లో తనిఖీ చేసి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక గొప్ప ప్రక్రియ అని, ప్రజలు స్వేచ్చగా ఓటు వేసేలా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, తగినంత పోలీస్ బందోబస్తు ఏర్పాటుతో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా,రీ పోల్ కు తావు లేకుండా కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీస్ బలగాలు, మైక్రో అబ్జర్వర్ ఏర్పాటు, వెబ్ క్యాస్టింగ్, వీడియోగ్రఫీ తదితర ఏర్పాట్లతో, పర్యవేక్షణ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో పిఎస్ సంఖ్య, నియోజకవర్గం, సంబంధిత పోలీస్ ఎస్ హెచ్ఓ పేరు నంబర్, తాసిల్డార్ పేరు ఫోన్ నంబర్లను, పి.సి నంబర్ ను ప్రస్ఫుటంగా కనిపించేలా ఏర్పాటు ఉండాలని సూచించారు. ఎఈఆర్ఓ లు, సెక్టోరల్ అధికారులు వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై, ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ర్యాంపు, త్రాగు నీరు, మరుగుదొడ్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ తిరుపతి నిశాంత్ రెడ్డి, తాశిల్డార్ ఉషారాణి, సెక్టోరల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.