Breaking News

ప్రముఖ న్యూరో సర్జన్ పువ్వాడ రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే అత్యంత అరుదైన శస్త్రచికిత్స

– 40 ఏళ్ల వ్యక్తి తల భాగం నుంచి భారీ కణితి తొలగింపు
– బాల్యం నుంచి తల భాగంలో గడ్డతో బాధ పడుతున్న రోగి
– ట్యూమర్ క్రమంగా పెరిగిపోవడంతో ప్రాణాంతకంగా మారిన వైనం
– వరుణ్ కార్డియాక్ అండ్ న్యూరో సైన్సెస్ నందు విజయయవంతంగా శస్త్రచికిత్స
– ఆపరేషన్ అనంతరం వేగంగా కోలుకున్న పేషెంట్
– తనకిది పునర్జన్మ అని, వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపిన రోగి మోహన్ రామ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని వరుణ్ కార్డియాక్ అండ్ న్యూరో సైన్సెస్ నందు అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన శస్త్రచికిత్సను ప్రఖ్యాత న్యూరో సర్జన్ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ విజయవంతంగా పూర్తి చేశారు. ఈ చికిత్సకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు బెంజ్ సర్కిల్ సమీపంలోని వరుణ్ కార్డియాక్ అండ్ న్యూరో సైన్సెస్ నందు శనివారం మీడియా సమావేశం ఏర్పాటుచేశారు.

ఈ సమావేశంలో డాక్టర్ పువ్వాడ రామకృష్ణ మాట్లాడుతూ.. “గుడివాడకు చెందిన మోహన్ రామ్ (40) తల భాగంలో గడ్డతో చిన్న వయసు నుంచి బాధ పడుతున్నారు. గడ్డ వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ, బయటి వ్యక్తులకు తన పరిస్థితి తెలీకుండా టోపీ పెట్టుకునేవాడు. అయితే, ఈ గడ్డ క్రమక్రమంగా పెరుగుతూ అత్యంత భారీ కణితిగా తయారైంది. కణితి రోజురోజుకూ పెరిగిపోతూ, పుర్రె ఎముకలను దెబ్బతీయడంతో మెదడుపై ఒత్తిడి తీవ్రమై పేషెంట్ భరించలేనంత నొప్పి బాధపడసాగాడు. ఆ పరిస్థితుల్లో రోగి, వరుణ్ కార్డియాక్ అండ్ న్యూరో సైన్సెస్ లో సంప్రదించాడు. 18 సెంటీమీటర్ల వెడల్పు, 10 సెంటీమీటర్ల పొడవుతో ఉన్న ఈ ట్యూమర్ మరింత పెరిగిపోతోందని, ట్యూమర్ వల్ల మెదడుపై దుష్ప్రభావం ఏర్పడి ప్రాణాపాయం సంభవించవచ్చని గుర్తించాం. దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి, పుర్రె భాగాన్ని ఆపరేషన్ ద్వారా ఓపెన్ చేసి, అతి భారీ కణితిని విజయవంతంగా తొలగించాం. ఆపరేషన్ అనంతరం రోగి వేగంగా కోలుకున్నాడు. ప్రపంచంలోనే ఈ ఆపరేషన్ అత్యంత అరుదైనది. దేశంలో ఇటువంటి శస్త్రచికిత్స ఇదే మొదటిదని చెప్పుకోవచ్చు. తొలగించిన కణితిలోని భాగాన్ని బయాప్సీ పరీక్షకు పంపగా, క్యాన్సర్ కణితి కాదని తేలడం మరింత ఆనందదాయకం” అని తెలిపారు.

శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న పేషెంట్ మోహన్ రామ్ ఈ సమావేశంలో మాట్లాడుతూ.. “సుదీర్ఘ కాలంగా వేధిస్తున్న సమస్యను శస్త్రచికిత్స ద్వారా పరిష్కరించిన డాక్టర్ పువ్వాడ రామకృష్ణ నాకు పునర్జన్మను ప్రసాదించారు. ట్యూమర్ భారీగా పెరిగిపోవడంతో ఇక జీవించడం కష్టమేమోనని భావించిన తరుణంలో వరుణ్ వైద్యులు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. వాళ్లు నిజంగా నా ప్రాణదాతలు” అని అన్నారు.

అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ పువ్వాడ రామకృష్ణ, డాక్టర్ పువ్వాడ రవితేజ, అనస్థీషియా విభాగం వైద్యులు డాక్టర్ సూర్య, డాక్టర్ దీప్తిలకు వరుణ్ కార్డియాక్ అండ్ న్యూరో సైన్సెస్ చైర్మన్ డాక్టర్ గుంటూరు వరుణ్ అభినందనలు తెలియజేశారు. ప్రపంచ వైద్య చరిత్రలో అద్భుతంగా పేర్కొనదగిన శస్త్రచికిత్సను తమ ఆసుపత్రిలో నిర్వహించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *