-సమ్మర్ స్టోరేజి ట్యాంకులను త్వరితగతిన నీటితో నింపండి
-నీటి ఎద్దడిగల ఆవాసాలకు జూన్ వరకూ ట్యాంకుల ద్వా నీటి సరఫరా
-పట్టణ ప్రాంతాల్లో కూడా తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోండి
-భూగర్భ జల మట్టాలను ప్రతి వారం మానిటర్ చేయండి
-సిఎస్ డా.కెఎస్.జవహర్ రెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవి తాగునీటి ఎద్దడిని అధికమించేలా వివిధ సమ్మర్ స్టోరేజి ట్యాంకులను పూర్తిగా నీటితో నింపేందుకు వీలుగా ప్రకాశం బ్యారేజి నుండి కాలువల ద్వారా ఈనెల 29 తేదీ వరకు,నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ నుండి ఈనెల 25వ తేదీ వరకూ కాలువల ద్వారా నీటిని విడుదలను కొనసాగించడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి పేర్కొన్నారు.ఈమేరకు సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో తాగునీటి సరఫరా పరిస్థితులు,మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు కల్పనపై ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ వేసవి తాగునీటి అవసరాలకు అనుగుణంగా వివిధ సమ్మర్ స్టోరేజి ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని అధికారులను ఆదేశించారు.మొత్తం 1046 సమ్మర్ స్టోరేజి ట్యాంకులకు గాను ఇప్పటికే 680 పైగా ట్యాంకులను నీటితో నింపారని తెలిపారు.మిగతా సమ్మర్ స్టోరేజి ట్యాంకులన్నిటినీ త్వరిత గతిన నింపాలని చెప్పారు.
అదే విధంగా నీటి ఎద్దడి గల ఆవాసాలకు జూన్ నెలాఖరు వరకూ ట్యాంకులు ద్వారా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఎస్.జవహర్ రెడ్డి చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం 234 ఆవాసాలకు ట్యాంకులు ద్వారా రోజూ మంచినీటి సరఫరా జరుగుతోందని పేర్కొన్నారు.పట్టణ ప్రాంతాల్లో కూడా ఎక్కడా తాగునీటికి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం భూగర్భ జల మట్టాల పరిస్థితులపై ఆశాఖ అధికారులతో సమీక్షిస్తూ ప్రతివారం భూగర్భ జల మట్టాల పరిస్థితులను మానిటర్ చేయాలని ఆదేశించారు.అంతేగాక ఏఏ జిల్లాల్లో భూగర్భ జలమట్టాలు బాగా తగ్గిపోతున్నాయో ఆయా వివరాలను జిల్లా కలక్టర్లకు తెలియ జేయాలని ఆశాఖ అధికారులను సిఎస్ ఆదేశించారు.అనంతరం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పధకం ద్వారా కూలీలకు కల్పిస్తున్న ఉపాధి పనులపై సిఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు.
పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 22లక్షల 59వేల మందికి పని కల్పించడం జరుగుతోందని తెలిపారు.రానున్న రోజుల్లో మరిన్ని పని దినాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు.
ఈసమావేశంలో ఆర్ డబ్ల్యుఎస్ ఇఎన్సి కృష్ణారెడ్డి,మున్సిపల్ శాఖ ఇఎన్సి ఆనంద రావు,ఎన్ఆర్జిఎస్ డైరెక్టర్ చిన తాతయ్య,భూగర్భ జల వనరుల శాఖ డైరెక్టర్ జాన్ సత్య రాజ్, మున్సిపల్ పరిపాలన శాఖ జెడి రవీంద్ర బాబు,ఆర్థికశాఖ జెడి సురేంద్ర,తదితర అధికారులు పాల్గొన్నారు.అలాగే వర్చువల్ గా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, జల వనరులు శాఖ ఇఎన్సి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.