విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లో డేటా లీక్‌కి ఆధారాలు ఉన్నాయంటూ వైస్సార్సీపీ కార్యకర్త, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కామిని విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. సోమవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో కామిని విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ తాను గడిచిన 14 సంవత్సరాలుగా వైస్సార్సీపీ కార్యకర్తగా ఉన్నానని, వైస్సార్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తరువాత, భద్రంగా, గోప్యంగా ఉండవలసిన మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా విచ్చలవిడిగా చేతులు మారుతోందన్నారు. అందరికన్నా ముందుగా డేటా లీక్‌ను తాను గుర్తించి, సీఎం జగన్మోహన్‌రెడ్డికి పూర్తి వివరాలతో లేఖ రాసినా స్పందనలేదని, ఈ విషయం బయటకు వస్తే ఒక వైస్సార్సీపీ అభిమానిగా, కార్యకర్తగా పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. అలా పార్టీకి నష్టం జరగకుండా ఉండటానికి, అలాగే ప్రజలు ఆ డేటా లీక్ వల్ల బాధితులు కాకూడదని, వైస్సార్సీపీ పెద్దలను కలిసి వివరించినా వాళ్ళు బాధ్యతగా నడుచుకోలేదని, విసుగు చెంది తాను ఈ నెల 18వ తారీఖున దగాపడ్డ వైస్సార్సీపీ కార్యకర్తగా, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశానని తెలియచేశారు. వైస్సార్సీపీ సెంట్రల్ పార్టీ ఇంచార్జ్ , ఎమ్మెల్సీ లేల్ల అప్పిరెడ్డిని పలుమార్లు కలిశానని, అయినా స్పందన లేదని, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌కి, పూర్తి వివరాలు చెప్పిన పట్టించుకోలేదని, ఇంకా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి, భూమన కరుణాకర్ రెడ్డికి, వైస్సార్సీపీ సోషల్ మీడియా ఇంచార్జి సజ్జల భార్గవ్‌కి చెప్పినా పట్టించుకోలేదన్నారు. తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, జనసేన పవన్‌కళ్యాణ్ కానీ , టీడీపీ నారా లోకేష్ కాని సమయం ఇస్తే పూర్తి ఆధారాలతో వివరిస్తానని, ప్రజలకు నిజం తెలియచేయాలన్నారు. వైస్సార్సీపీ ఈ డేటాతో సోషల్ ఇంజనీరింగ్ చేస్తోందని, అందుకే ఎంతో మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చారన్నారు. ఎలక్షన్ కమీషన్‌కు కంప్లైంట్ చేయబోతున్నట్టు తెలిపారు. ఈ డేటా లీక్ కు కారణం వైస్సార్సీపీ పార్టీ ఆయా కంపెనీలతో లాలూచీపడటమే కారణమన్నారు. చివరగా మాట్లాడుతూ వైస్సార్సీపీ నాయకులకు, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి డేటా లీక్ గురించి ఛాలెంజ్ చేస్తూ, తాను గనుక డేటా లీక్‌ను ఆధారాలతో చూపిస్తే, మొత్తం ప్రజలకు క్షమాపణలు చెప్పి, జరిగిన తప్పుకి తగిన బాధ్యత వహిస్తూ ఎన్నికల నుండి విరమించుకోవాలని కోరారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …