అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖవాసులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శుభవార్త అందించింది. ఇటీవల విశాఖలో పర్యటించిన ముఖ్యమంత్రి .. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో కొంత కదలిక వచ్చింది. విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నడుం బిగించింది. ఈ క్రమంలోనే విశాఖ పర్యటనలో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి గతంలో నిర్ణయించిన డిజైన్లకు అధికారులు కొన్ని మార్పులు చేయనున్నారు. విశాఖలో ఎన్‌హెచ్‌ఏఐ నిర్మించే ఫ్లై ఓవర్ బ్రిడ్జిల ఆధారంగా మెట్రో డిజైన్లు ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే ఎన్‌హెచ్‌ఏఐతో సమన్వయం చేసుకును ముందుకు వెళ్లేందుకు వీలుగా అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి సీఎం చంద్రబాబు పర్యటన అనంతరం కదలిక వచ్చింది. మెట్రో రైలుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక -డీపీఆర్‌లోనూ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. మెట్రో పనుల్ని ముందుకు తీసుకువెళ్లాలన్న తన ఆలోచనలను ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్ ఎండీ యూజేఎం రావుకు తెలిపారు. ఇక నగరంలో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు పలుచోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వాటిని నిర్మించిన తర్వాత మెట్రో నిర్మిస్తే ఇబ్బందులు తలెత్తవచ్చన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్‌హెచ్‌ఏఐకి, మెట్రో రైలుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మాణాలు చేపట్టాలని అధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం విశాఖలో 12 ఫ్లై ఓవర్లు నిర్మించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ డీపీఆర్ సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రాంతాల్లో పిల్లర్ల చుట్టుకొలత పెంచడం, కొన్ని అదనంగా నిర్మించడం, వంతెనల పొడవు, వెడల్పుల్లోనూ కొన్ని మార్పులు చేయనున్నారు. అయితే అధికారుల సమావేశం తర్వాత త్వరలోనే వాటిపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Tags amaravathi
Check Also
రూ. 18వేల కోట్లు కాదు… రూ. 20 వేల కోట్ల భారం మీ పాపమే
-విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ సీఎం జగన్ మోహన్ …