-వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షుడు ఏ.విజయ రాఘవన్ పిలుపు
-వ్యవసాయ కార్మికులు వ్యవసాయేతర కార్మికుల్ని కూడా సమీకరించాలి
-AIAWU జాతీయ కౌన్సిల్ తీర్మానం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ ప్రాంతాల్లోని పేదలందరినీ వ్యవసాయ కార్మిక సంఘం ఒక గొడుగు కిందకు రావడం ద్వారానే కార్పొరేట్ కమ్యూనల్ శక్తులను అడ్డుకోగలమని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షులు ఏ విజయ రాఘవన్ అన్నారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి లో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సమావేశాలు జూలై 14, 15 తేదీలలో జరుగుతున్నాయి. ఈ సమావేశాలు ప్రారంభ సూచికంగా విజయ రాఘవన్ జండా ఆవిష్కరణ చేశారు. అనంతరం జరిగిన ప్రారంభ సభలో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ శక్తుల ప్రభావంతో వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు గ్రామీణ పేదల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయని అన్నారు. వ్యవసాయ సీజన్లో వ్యవసాయ కూలీలుగా, వ్యవసాయ పనులు లేని కాలంలో వ్యవసాయేతర పనులు చేస్తున్న గ్రామీణ పేదలు తమ జీవిత అవసరాలు తీరక దుర్బర జీవితాలు గడుపుతున్నారని అన్నారు. పాలకులు సామాన్యులను దోచి సంపన్నులకు దేశ సంపదను కట్టబెట్టే విధానాలను అనుసరిస్తున్నారని అన్నారు. దీని ఫలితంగా హంగర్ ఇండెక్స్ లో భారత్ 116వ స్థానానికి చేరిందని అన్నారు.74 శాతం ప్రజలకు పౌష్టికాహారం అందట్లేదని అన్నారు. పోషక విలువలు అందక మహిళలు, చిన్నారులు తీవ్రంగా అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. పెరుగుతున్న ధరల వేగంతో కనీస వేతనాలు పెరగటం లేదని, పెరుగుతున్న జీవన వ్యయంతో కుటుంబ అవసరాలు తీర్చుకోలేని స్థితిలో గ్రామీణ పేదల జీవితం దారుణంగా మారుతున్నరని అన్నారు. అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిధులు తగ్గించి నిర్వీర్యం చేస్తున్నది అన్నారు. వంద రోజులు కల్పించాల్సిన పనిదినాలను సగటున 46 రోజులు కూడా కల్పించడం లేదని, ఉపాధి పేదలకు తీవ్రమైన సమస్యగా మారిందని అన్నారు. పాలకుల కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి గురవుతున్నాదని, పేద రైతులు, వ్యవసాయ కూలీలతోపాటు, గ్రామీణ పేదలందర్ని ఒక గొడుగు కిందకు సమీకరించాలని అన్నారు.
వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ విధానాలు క్రమంగా పుంజుకుంటున్నాయని అన్నారు. మూడు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాలను ఎన్డీఏ ప్రభుత్వం గత పదేళ్లుగా వేగవంతంగా అమలు చేస్తున్నదని అన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి తెచ్చిన మూడు నల్ల చట్టాల అమలును ప్రజా పోరాటాలతో తాత్కాలికంగా వెనక్కి కొట్టగాలిగామని అన్నారు. బిజెపి అనుసరిస్తున్న కార్పొరేట్ కమ్యూనల్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ప్రతిఘటనలోకి వస్తున్నారని అన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఈ విధానాలను అనుసరిస్తున్న బిజెపికి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. బిజెపి హిందుత్వ ఎజెండాతో ఉత్తరాది రాష్ట్రాల్లో సృష్టిస్తున్న అరాచకాన్ని సహించేది లేదని ఆయా రాష్ట్రాల ప్రజలునిరూపించారని, బిజెపికి వ్యతిరేకంగా అనేక రాష్ట్రాలలో ఓటు వేశారని తెలిపారు. బిజెపి బలాన్ని కూడా ఎన్నికల్లో ప్రజలు తగ్గించారని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం ఇప్పటివరకు ప్రధానంగా వ్యవసాయ కూలీలను సమీకరిస్తున్నదని, రాబోవు కాలంలో గ్రామీణ పేదలందరినీ ఐక్యం చేసేటువంటి ఉద్యమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశాల్లో జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ కార్యక్రమాల సమీక్ష, భవిష్యత్తు కర్తవ్యాలను ప్రవేశపెట్టారు. వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన ప్రతినిధులు దానిమీద చర్చించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి. సుబ్బారావు, వి వెంకటేశ్వర్లు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి నాగయ్య, పి. వెంకట్రాములుతోపాటు జాతీయ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు