Breaking News

ఉద్యోగుల సంక్షేమమే ముఖ్యమంత్రి ధ్యేయం

-అన్నివేళలా అందుబాటులో ఉంటాం
-ఎన్జీవో నేత ఎండి ఇక్బాల్ సేవలు స్పూర్తి దాయకం.
-ఏపీ ఎన్జీవో సంఘం పోరాటాలు ప్రశంసనీయం
-ఎండి ఇక్బాల్ పదవీ విరమణ కార్యక్రమంలో సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత ఐదు ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులు అనుభవించిన మానసిక వేదనకు ముగింపు పలికిన వర్గాలలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్రని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ఏపీ ఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శిగా మూడు దశాబ్దాల పాటు పదవీ బాధ్యతలు నిర్వహించిన వ్యవసాయ శాఖ సూపరిండెంట్ గా రిటైర్మెంట్ తీసుకున్న ఎం. డి. ఇక్బాల్ పదవి విరమణ కార్యక్రమం జిల్లా సంఘ నేత ఎ. విద్యా సాగర్ ఆద్వర్యం లో ఆదివారం నగరంలోని శేష సాయి కళ్యాణ మండపంలో జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో సానుకూలంగా ఉన్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ఎంతో అమూల్యమైన సేవలందిస్తున్న ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు పాలన ఉందని గుర్తు చేశారు. సమస్యలు ఏర్పడినప్పుడు ఎన్నో ప్రభుత్వాలతో ఏపీ ఎన్జీవో సంఘం నిర్వహించిన ఉద్యమాలు ప్రశంసనీయమన్నారు. అతి త్వరలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘ నేతలతో సమావేశం నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని తెలిపారు.

తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామమోహన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా ఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన ఎండి ఇక్బాల్ చాలా కార్య దక్షత కలిగిన నాయకుడన్నారు. గత రెండు దశాబ్దాలుగా తనకు పరిచయం ఉన్న వ్యక్తిగా ఆయన వ్యవహార శైలి, సామరస్య పూర్వక వాతావరణంలో ప్రభుత్వం
ఉన్నతాధికారులతో చర్చలు జరపడంలో ఎంతో పరిణతి కనబరిచేవారన్నారు. ఉద్యోగ సంఘ నాయకుడిగా ఆయన సంపూర్ణంగా విజయవంతం అయ్యార న్నారు. ఒక మంచి నాయకుడికి కావలసిన అన్ని లక్షణాలు ఉన్న ఇక్బాల్ వంటి నాయకులను మనం భవిష్యత్తులో చూడలేమన్నారు.

మధ్య నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగులు కోరుతున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో ఉద్యోగులకు శుభవార్త చెప్తారన్నారు. ఐదేళ్ల పీడకలను మరిచిపోయి సంక్షేమం, అభివృద్ధి సమాన స్థాయిలో నిర్వహించేందుకు ఉద్యోగులు సిద్ధం కావాలన్నారు. ఉద్యోగుల హితం కోరుకునే తమ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వక అనుబంధం కోరుకుంటోంద న్నారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని, ఆశలను నెరవేరేలా చంద్రబాబు నాయుడు పాలన ఉంటుందన్నారు.

ఏపీ ఎన్జీవో సంఘం మాజీ నాయకులు, శాసనమండలి మాజీ సభ్యులు పరుకూరి అశోక్ బాబు మాట్లాడుతూ ఒక మాజీ ఉద్యోగ నాయకుడిగా ఉద్యోగుల సమస్యలు తనకు తెలిసినంతగా మరెవ్వరికి తెలియదన్నారు. ఉద్యోగులకు హక్కుగా రావలసిన ప్రతి ప్రయోజనాన్ని అందజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ అధికారులతో ఇప్పటికే సమీక్షించారన్నారు. ఆర్థిక పరిస్థితులు సరిదిద్దేంత వరకు ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. గత ప్రభుత్వంలో కోల్పోయిన ప్రతి హక్కును ఉద్యోగులు తిరిగి పొందేందుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. ప్రభుత్వంలో ఎవరు ఉన్నారనే దానితో సంబంధం లేకుండా ఏపీ ఎన్జీవో సంఘం నిర్వహించిన ఎన్నో పోరాటాలలో తాను కూడా భాగస్వామి కావడం గర్వంగా భావిస్తున్నానన్నారు

ఎన్టీఆర్ జిల్లా ఎన్జీవో సంఘం అధ్యక్షులు ఎ. విద్యాసాగర్ మాట్లాడుతూ పదవి విరమణ పొందిన ఎం. డి. ఇక్బాల్ తో కలిసి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రెండున్నర దశాబ్దాలకు పైగా వివిధ పోరాటాలలో కలిసి పనిచేయటం తన జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా ఉంటుందన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎన్జీవో సంఘ నేతలుగా తాము ఉద్యోగుల ప్రయోజనాలే పరమావధిగా పనిచేశామన్నారు. ఇక్బాల్ వంటి చిత్తశుద్ధి కలిగిన నాయకులను భవిష్యత్తు తరాలు స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలన్నారు. కార్యక్రమం అనంతరం అతిథులు ఇక్బాల్ దంపతులను ఘనంగా పూలమాలలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఏపీఎన్జీవో రాష్ట్ర సంఘ సహాధ్యక్షుడు దస్తగిరి రెడ్డి, ఎన్జీవో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.వి. రమణ, షరీఫ్,
గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, ఒంగోలు జిల్లా అధ్యక్షుడు శరత్, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పెంచలరావు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్, పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ ఎ. సాంబశివరావు, 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్, పశుసంవర్ధక శాఖ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, కదిరి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శోభన్ బాబు, రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు కె. వెంకటేశ్వర్లు, రవాణా శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రఘుబాబు, సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంసీదాస్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జానీ బాష, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హరికృష్ణ, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి రమేష్, గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్నెంట్ వెంకటేష్, డెమొక్రటిక్ పిఆర్టియు రాష్ట్ర సంఘ అధ్యక్షులు డి శ్రీనివాస్, సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి సుందరయ్య, పిఎఓ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హరినాథ్ బాబు తదితరులతో సహా రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలకు చెందిన శాశ్వత ఉద్యోగులు, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Check Also

ఏపీఐఐసీ కొరకు సత్యవేడు మండలం రైతులతో భూసేకరణ పై ముఖాముఖి చర్చించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్ర ప్రభుత్వం అనేక పరిశ్రమలను పెట్టుబడులను పెట్టడానికి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో పలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *