అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతుల కోసం అమలు చేస్తున్న గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ (GAP), భూసార పరిరక్షణ, భూసార పరీక్ష ఆధారంగా ఎరువుల వాడకం, రాయతీ పై విత్తనాల సరఫరా, గ్రామ స్థాయి లో విత్తనోత్పత్తి, వ్యవసాయ యాంత్రీకరణ, సేంద్రీయ వ్యవసాయం వంటి శాస్త్రీయ అంశాలపై “పొలం పిలుస్తోంది” కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించనున్నామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ఆదివారం వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు పలు సూచనలు చేశారు. రైతులకు ఎరువులు, విత్తనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. పారదర్శకంగా రైతులకు సేవలు అందించాలని, సిబ్బంది క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి రైతుల సమస్యలకు సకాలంలో సూచనలు అందించాలని పేర్కొన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి” సాధించే దిశగా రైతులను ముందుకు నడిపించడానికి “పొలం పిలుస్తోంది”. కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.