మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రెవెన్యూ సదస్సులు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో రెవెన్యూ సదస్సులు నిర్వహణపై జిల్లా కలెక్టర్ సోమవారం రెవెన్యూ అధికారులతో కలెక్టరేట్లో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఈనెల 15 నుండి రెవిన్యూ సదస్సులు నిర్వహించుటకు అన్ని చర్యలు తీసుకోవాలని, రెవెన్యూ సదస్సుల నిర్వహణలో ప్రభుత్వ విధివిధానాలు పాటించాలన్నారు. మొదట రీ సర్వే చేపట్టని గ్రామాల్లో, చిన్న గ్రామాల్లో, పెద్దగా భూ సమస్యలు లేని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. ఒక్కొక్క రెవిన్యూ సదస్సుకు మధ్యలో రెండు మూడు రోజుల గ్యాప్ ఉండేలా చూడాలన్నారు. గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడానికి ముందుగా రెవిన్యూ టీములు గ్రామంలో పర్యటించి స్థానికంగా భూ సమస్యలు గుర్తించాలని, వాటి పరిష్కారానికి చేపట్టవలసిన చర్యల గురించి అవగాహన కల్పించుకోవాలని అన్నారు. గ్రామ సదస్సులు నిర్వహణలో వచ్చే సమస్యలను ముందుగా ఊహించి ఆలోచించి ఆయా సమస్యలకు ఎండార్స్మెంట్లు ఎలా ఇవ్వాలి ముందుగా స్టాండర్డ్ ఫార్మేట్ తయారు చేసుకోవాలని సూచించారు. అర్జీదారునికి అర్థమయ్యే రీతిలో తెలుగులో స్పష్టంగా ఎండార్స్మెంట్ ఇవ్వాలని, వారి సమస్య ఎన్ని రోజులకు పరిష్కారం అవుతుందో పేర్కొనాలని, ఈ విధానం చాలా సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తుందన్నారు. గ్రామాల్లో ముఖ్యంగా పార్టిషన్స్, సబ్ డివిజన్స్ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, ఇలాంటివి పార్టిషన్, సబ్ డివిజన్ చేసి అర్జీ క్లోజ్ చేయవచ్చన్నారు.
డిఆర్ఓ ఇంచార్జ్ శ్రీదేవి మాట్లాడుతూ గ్రామసభ నిర్వహించునపుడు కౌంటర్స్ ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. బందర్ ఆర్డీవో ఎం వాణి, బంటుమిల్లి, మచిలీపట్నం, గుడివాడ, కంకిపాడు, పెనమలూరు తాసిల్దార్లు జూమ్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.