Breaking News

మినిస్టర్ అయినా… ప్రజలకు సేవకురాలే…

-మోకాలి లోతు నీటిలో మహదేవ పల్లి రైల్వే అండర్ పాస్
-దగ్గరుండి నీటిని తోడించిన మంత్రి
-మంత్రి సవితమ్మ చొరవపై స్థానికుల ప్రశంసలు

పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. అధికారులకు చెప్పి ఆ సమస్యను పరిష్కరిస్తారు కొందరు ప్రజా ప్రతినిధులు. ఇంకొందరైతే… తర్వాత చూద్దామంటారు. కానీ …రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత పని తీరు ఈ రెండింటికీ భిన్న్నం. సమస్యపై ఎవరూ ఫిర్యాదు చేయకున్నా… తాను సమస్యను స్వయంగా గుర్తిస్తే చాలు… వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. ఇటువంటి ఘటనే ఆదివారం చోటు చేసుకుంది. రొద్దం మండలంలో అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తను పరామర్శించడానికి మంత్రి వెళ్లారు. మార్గమధ్యంలో పెనుకొండ మండలం మహదేవ పల్లి రైల్వే పాస్ వద్ద రోడ్డు పూర్తిగా శిథిలమైపోయి ఉంది. మోకాలి లోతు నీరు నిల్వ ఉంది. రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ఆ రహదారి మీదుగా వెళుతున్న మంత్రి సవితమ్మ రహదారి దుస్థితిని గమనించారు. తక్షణమే తన కాన్వాయ్ ఆపి… ఆర్ అండ్ బి అధికారులకు ఫోన్ చేశారు. మహదేవపల్లి రైల్వే అండర్ పాస్ దుస్థితి గురించి చెప్పి.. తక్షణం రోడ్డుపై నిల్వ ఉన్న వర్షపు నీటిని తోడించాలని ఆదేశించారు. వెంటనే ఆర్ అండ్ బి అధికారులు హుటాహుటిన తరలివచ్చారు. రహదారిపై ఉన్న నీటిని ప్రొక్లయినర్ సాయంతో మంత్రి అక్కడ ఉండగానే తోడించారు. ఎవరూ ఫిర్యాదు చేయకున్నా… తమ కష్టాన్ని గుర్తించి పరిష్కారానికి కృషి చేసిన మంత్రి సవితమ్మ పని తీరును స్థానికులు కొనియాడారు. ప్రజలకు ఇటువంటి నాయకులే కదా… కావాల్సింది అంటూ మంత్రిపై ప్రశంసలు కురిపించారు.

నేనున్నా… వ్యాధిగ్రస్తునికి మంత్రి భరోసా
రొద్దం మండల కేంద్రం ఎస్సీ కాలనీకి చెందిన వెంకటేశ్ తీవ్ర అనారోగ్యంతో కొద్ది రోజులుగా బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి సవితమ్మ… టీడీపీ కార్యకర్త వెంకటేశ్ ను పరామర్శించారు. పార్టీ తో పాటు, తాను వెన్నంటి ఉంటామని, ధైర్యంగా ఉండమని ఆయనకు, తన కుటుంబ సభ్యులకు మంత్రి భరోసా ఇచ్చారు. అంతేకాదు… ఆర్థికసాయం కూడా అందజేశారు. అనంతరం మరువపల్లిలో అనారోగ్యంతో మరణించిన టీడీపీ సీనియర్ నాయకులు బాల నాయుడు పార్దివ దేహానికి మంత్రి సవితమ్మ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అండగా ఉంటామని మంత్రి వారికి సవితమ్మ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *