మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పరిశ్రమల్లో ప్రాణ ఆస్తి నష్ట నివారణకు భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కంపెనీ యాజమాన్యాలను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. సమావేశానికి ముందు కలెక్టర్ జిల్లాలోని పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఆయా కంపెనీలు పాటిస్తున్న భద్రతా ప్రమాణాలపై కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి కంపెనీ వారి కార్మికులు లేదా ఉద్యోగులు వ్యక్తిగత రక్షణ పరికరాలు (పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్) తప్పనిసరిగా ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
కంపెనీ మార్గదర్శకాల ప్రకారం గ్లౌస్ లు, గౌన్‌లు, షూ కవర్‌లు, హెడ్ కవర్‌లు, మాస్క్‌లు, రెస్పిరేటర్‌లు, కంటి రక్షణ, ఫేస్ షీల్డ్‌లు వంటి రక్షణ పరికరాలు కలిగి ఉండాలన్నారు. ప్రమాద సంకేతాలు పరిశ్రమలోని అన్ని ప్రదేశాలలో పనిచేస్తున్న కార్మికులకు వెంటనే చేరే విధంగా పకడ్బందీ ఏర్పాట్లు కలిగి ఉండాలని సూచించారు. కంపెనీలోని కార్మికుల భద్రతే తొలి ప్రాధాన్యమని, పనిచేసే చోట వారి ప్రాణాలకు రక్షణ ఉన్నప్పుడు సహజంగానే కంపెనీ అభివృద్ధి చెందుతుందని ఆయన గుర్తు చేశారు. అనంతరం ఆయన జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశానికి సంబంధించిన అజెండా అంశాలపై అధికారులతో చర్చించారు.
వీరపనేనిగూడెం, మల్లవల్లి, చల్లపల్లి వంటి ప్రాంతాలలో పరిశ్రమల ఏర్పాటుకు ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సింగిల్ విండో పద్ధతిపై అనుమతులు, మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ ఆర్ వెంకట్రావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ శ్రీనివాసరావు, ఏపీఐఐసీ జిల్లా జోనల్ మేనేజర్ మధు, ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సిఆర్డిఏ జేడి ధనుంజయ రెడ్డి, డిపిఓ నాగేశ్వర నాయక్, ఏఎస్పి ప్రసాద్, లేబర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ ఆషారాణి తదితరులు పాల్గొన్నారు.