Breaking News

న్యాయ సేవ శిబిరానికి సమన్వయంతో అన్ని ఏర్పాట్లు సజావుగా పూర్తి చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 31 తేదీన పెడనలో నిర్వహిస్తున్న న్యాయ సేవ శిబిరానికి సమన్వయంతో అన్ని ఏర్పాట్లు సజావుగా పూర్తి చేయాలని జిల్లా న్యాయ సేవా సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీ కె.వి రామకృష్ణయ్య జిల్లా అధికారులకు సూచించారు. బుధవారం ఉదయం నగరంలోని న్యాయస్థానాల సముదాయంలోగల న్యాయ సేవా సదన్ లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జిల్లా ఇన్చార్జి రెవెన్యూ అధికారి జి శ్రీదేవి తో కలిసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి నూతన న్యాయ సేవా శిబిరం ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నూతన విధానంలో న్యాయ సేవా శిబిరాన్ని ఈనెల 31వ తేదీన ఉదయం 10 గంటలకు పెడన మండలం నందమూరు గ్రామంలోని వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా గంజాయి వంటి మత్తుమందు వాడకం రాను రాను ఎక్కువైందని పాఠశాల విద్యార్థుల వద్దకు చేరుతుందన్నారు. దీనిని నివారించడంతోపాటు బాధితులకు న్యాయ సేవలు అందించడం, ఆ మత్తుమందు ముప్పు నిర్మూలన, సీనియర్ సిటిజనులకు గల హక్కులు, ప్రయోజనాలు, న్యాయ సేవలు అనే అంశాలపై ప్రధానంగా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యకలాపాలను వివరిస్తామన్నారు.

అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను, వాటి ప్రయోజనాలను వివరిస్తూ సంబంధిత ప్రభుత్వ శాఖలు ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయడంతో పాటు దరఖాస్తు పత్రాలు, కరపత్రాలు, బ్రోచర్లు పంపిణీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ శిబిరంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారి పాల్గొంటారన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అగ్ని ప్రమాదాలు నియంత్రించడానికి అవసరమైన అగ్నిమాపక యంత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వేదిక వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలన్నారు. ఆరోగ్య పరీక్షలు చేసి కావాల్సిన మందులు ఇచ్చేందుకు వీలుగా వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలన్నారు. శిబిరానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు. అందరూ సమన్వయంతో పనిచేసి న్యాయ సేవ శిబిరం జయప్రదం చేయాలన్నారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పి ఎస్ వి డి ప్రసాద్, జిల్లా అగ్నిమాపక అధికారి డి ఏసు రత్నం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్రావు, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి అబ్దుల్ రబ్బాని, ఎల్డిఎం జయవర్ధన్, ఉపవిద్యాధికారి శేఖర్ సింగ్, డి ఆర్ డి ఏ ఏ పీ ఎం రాజా గోవింద్, సహాయ బీసీ సంక్షేమ అధికారి అలియా బేగం తదితర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *