బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ బాపట్ల జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. బొమ్మనవాని పాలెం, కొల్లూరు, పెద్ద లంక, అన్నవరపు లంక, ఈపురు లంకతో పాటు ఇతర ముంపు గ్రామాల్లో ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కృష్ణ నది నుంచి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండడంతో బాపట్ల పరిధిలో ఉన్న మొత్తం 9 లంక గ్రామాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు చేరవేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు.ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అందుబాటులో ఉన్న బోట్లను వినియోగించుకోవాలని కోరారు.
40 వేల మందికి ఆహారం రెడీ
క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్న మంత్రి గొట్టిపాటి సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఇప్పటి వరకు వరద బాధితులకు అందుతున్న సాయంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలు ఎవరూ కూడా ఆకలితో ఉండకూడదన్నారు. వారి కోసం ఆహార పొట్లాలను స్వయంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సిద్ధం చేయించారు. బాపట్ల, పొన్నూరు, రేపల్లే, విజయవాడలోని వివిధ వరద ప్రభావిత ప్రాంతాలకు ఆహార పొట్లాలను సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. సుమారు 40 వేల మందికి సరిపడా ఆహార పొట్టాలను సిద్ధం చేసినట్లు చెప్పారు.
500 మందితో రంగానికి సిద్ధం
మరోవైపు విద్యుత్ శాఖ పై కూడా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వరుస సమీక్షలు చేపట్టారు. విద్యుత్ శాఖకు సంబంధించిన ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని మూడు డిస్కంల సీఎండీలకు నిరంతర పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న సీపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సమస్యలను చక్కదిద్దేందుకు ఈపీడీసీఎల్ నుంచి 300 మంది, ఎస్పీడీసీఎల్ 200 మంది పైగా టెక్నీషియన్లను రప్పించినట్లు మంత్రి తెలిపారు. వరద ప్రవాహం తగ్గిన వెంటనే సిబ్బందిని 200 టీములుగా రంగంలోకి దింపేలా ప్రణాళికలు సిద్దం చేశామని అన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు 1912 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు.