-ఇల్లినాయిస్ స్టేట్ సెనేటర్ రామ్ విల్లివలమ్
-అమెరికాలో సెనెటర్ రామ్ విల్లివలమ్ తో సమావేశమైన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
-అమరావతి నిర్మాణంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు టెక్నాలజీ అందించేందుకు సిద్ధం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు సిద్ధమని ఇల్లినాయిస్ స్టేట్ సెనేటర్ రామ్ విల్లివలమ్ అన్నారు. మంగళవారం అమెరికాలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్దప్రసాద్ ఇల్లినాయిస్ స్టేట్ సెనేటర్ రామ్ విల్లివలమ్ తో సమావేశమయ్యారు. డెమక్రటిక్ పార్టీ నుంచి తెలుగు బిడ్డ తొలి ఆసియన్-అమెరికన్ సెనేటరుగా ఎన్నిక కావటం తెలుగు జాతికి గర్వదాయకమని పేర్కొంటూ బుద్ధప్రసాద్ ఆయనను అభినందించారు. ఈ సందర్బంగా ఇల్లినాయిస్ స్టేట్ సెనేటర్ రామ్ ఆయనతో మాట్లాడుతూ తన తల్లి గుంటూరు జిల్లా వారు కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇల్లినాయిస్ రాష్టం ద్వారా అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలనే ఆకాంక్ష ఉందని చెప్పారు. ప్రత్యేకించి భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్ద నిర్మాణంలో తమ రాష్ట్రానికి ప్రత్యేకత ఉందని, తమ నిపుణుల సేవలు అమరావతి నిర్మాణానికి ఉపయోగించడానికి సిద్దమని రామ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనా దక్షత, అభివృద్ది కాముకత తమకు తెలుసని, వారికి తోడ్పాటు అందించడం కర్తవ్యంగా భావిస్తున్నానని రామ్ పేర్కొన్నారు. సమావేశంలో ధరణి విల్లివాలమ్, డాక్టర్ శ్రీరామ్ శోంటి రజిత్ గాంగ్లి, కోడూరి రామకృష్ణ పాల్గొన్నారు.