– 400 పంచాయతీలకు రూ.4 కోట్లు విరాళం ఇస్తున్నాను
– నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తాము
– విపత్తు వేళ కూటమి ప్రభుత్వం పకడ్బందీగా పని చేస్తోంది
– గత ప్రభుత్వ నాయకులు విమర్శలు మాని, ఆపదలో ఉన్న ప్రజలకు సాయం చేయడంపై దృష్టి పెట్టాలి
– సహాయక చర్యలకు విఘాతం కలుగుతుందనే వరద ప్రాంతాల్లో పర్యటించలేదు
– ముఖ్యమంత్రి జేసీబీ ఎక్కి మరీ విపత్తు ప్రాంతంలోకి వెళ్తున్నారు
– బుడమేరు ఆక్రమణలే బెజవాడకు శాపం
– కేంద్ర అటవీశాఖ శాటిలైట్ పర్యవేక్షణ తరహాలో నదీ పరివాహక ఆక్రమణల గుర్తింపునకు ఆలోచన చేస్తాం
– పంచాయతీరాజ్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ అనంతరం విలేకరుల సమావేశంలో ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘అనుకోని ప్రకృతి విపత్తు వరదల రూపంలో ఆరు జిల్లాల్లో, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాపై విరుచుకుపడిన వేళ కూటమి ప్రభుత్వం బలంగా పని చేసింది. వరద బాధితులకు భరోసా ఇచ్చేలా యంత్రాంగం కదిలింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ, ఎన్నో సవాళ్లు పాలనలో కనిపిస్తున్నా సమర్ధంగా యంత్రాంగాన్ని నడపడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషి ప్రశంసనీయమ’ని ఉపముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు అనుభవం, పాలనలోని మెలకువలు ఈ విపత్తును ఎదుర్కోవడంలో బాగా పని చేశాయన్నారు. బుడమేరు డ్రైయిన్ విపత్తే విజయవాడకు ఇబ్బందికరంగా మారిందని చెప్పారు. నదీ పరివాహక ప్రాంతాలు, వాగులు వంకలు వాటి సహజ సిద్ధగమనానికి విరుద్ధంగా మానవ నివాసాలు వెలుస్తుండడం వల్లే పరిస్థితి తీవ్రంగా మారుతోందని చెప్పారు. బుధవారం పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్రంలోని పంచాయతీరాజ్ అధికారులు, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల అధికారులు, సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరదల వేళ పంచాయతీరాజ్ సిబ్బంది పనితీరు, క్షేత్ర స్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాన్ని టెలీకాన్ఫరెన్స్ లో వివరించారు. వరదల వేళ అంకితభావంతో ప్రజలకు సేవలందించాలని పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా విభాగం సిబ్బందికి సూచించారు.
అనంతరం విలేకర్ల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ
“బుడమేరును ఆక్రమించి దాని సహజ స్వరూపాన్ని పూర్తిగా నాశనం చేసిన నిర్మాణాల వల్లనే విజయవాడకు వరద విపత్తు వచ్చిందన్నారు. నదీ పరివాహక ప్రాంతాలు, డ్రైయిన్లు, వాగులు, వంకలు, చెరువుల్ని ఆక్రమించి ఇష్టానుసారం లే అవుట్లు వేయడం, ఇళ్లు నిర్మాణం చేయడం వల్ల చిన్నపాటి వర్షాలకు కూడా పెద్ద నష్టం తప్పడం లేదన్నారు. ఇది ఏ ఒక్కరి తప్పో, ఏ ప్రభుత్వం తప్పో అని చెప్పనని, గత కొంత కాలంగా ఈ ఆక్రమణలు సాగుతూనే ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో కనీసం దీనిపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవన్నారు.
విమర్శలకు ఇది సమయం కాదు.. కలిసి పని చేద్దాం రండి..
74 ఏళ్ల వయసులో మూడు రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వరద బాధితులను ఆదుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటే ఆయన శ్రమను గుర్తించకుండా గత ప్రభుత్వ నాయకులు అడ్డగోలుగా విమర్శలు చేయడం సరికాదన్నారు. వరద నీటిలో దిగి, ప్రొక్లైనర్లు ఎక్కి, బోట్లలో బాధితుల వద్దకు వెళ్తున్నారని, ఇది విమర్శలు చేసే సమయం కాదన్నారు. వరదల్లో చిక్కుకున్న వారి కోసం అందరూ నిద్రాహారాలు మాని కష్టపడుతున్నారన్నారు. ప్రజలకు వచ్చిన సమస్య ఏదైనా రాజకీయాలకు అతీతంగా స్పందించాలన్నారు. గత ప్రభుత్వ నాయకులు కూడా అనవసరమైన విమర్శలు మానుకుని సహాయక చర్యల్లో పాల్గొనే విషయంలో ముందుకు రావాలని, అంతా కలిసి ప్రజలకు సహాయ పడదామన్నారు. అంతే తప్ప పని చేసే వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం మంచిది కాదన్నారు. ప్రభుత్వం అన్ని విధాలా బాధితులకు తగిన విధంగా సహాయం అందిస్తుందని, సాంకేతికతను వినియోగించుకుని బాధితులకు సహాయపడడంతో పాటు మంత్రులంతా క్షేత్ర స్థాయిలో తీవ్రంగా శ్రమిస్తున్నారన్నారు. గత ప్రభుత్వ నాయకులు కూడా దానిలో పాలు పంచుకోవాలన్నారు.
నేను పర్యటిస్తే ఎలా ఉంటుందో గత ప్రభుత్వ నాయకులు వస్తే చూపిస్తా..
నేను కనిపించడం లేదంటూ, వరదల వేళ విజయవాడ రాలేదంటూ విమర్శలు చేస్తున్న గత ప్రభుత్వ నాయకులు ఒకటి గుర్తు పెట్టుకోవాలన్నారు. విపత్తు వేళ నేను క్షేత్ర స్థాయికి వెళ్తే నా చుట్టూ జనం గుమిగూడి సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. పోలీసులు, ఇతర అధికారుల పని తీరుకు విఘాతం కలుగుతుందని, ఈ కారణం చేతనే అధికారుల సూచన మేరకు క్షేత్ర స్థాయికి రాలేదు తప్పితే మరేమీ కాదన్నారు. ఇంకా నాపై విమర్శలు చేయాలి అనుకునే గత ప్రభుత్వ నాయకులు ఎవరైనా నాతోపాటు పర్యటనకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో స్వయంగా చూపిస్తానన్నారు. వాళ్లు సోషల్ మీడియాలో మాట్లాడడం కాదు, క్షేత్ర స్థాయికి రండన్నారు. వరద బాధితులకు మీవంతు సహాయం చేయండి. అంతేగాని ఆపద వేళ అనవసరపు విమర్శల వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు.
గత ప్రభుత్వ హయాంలో నీటి పారుదల శాఖను పూర్తి కి వదిలేశారు. కనీస నిర్వహణకు కూడా నిధులు ఇవ్వలేదు. గత ప్రభుత్వ హయాంలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడం వెనుక ఇసుక మాఫియాకి సహకరించడమే ప్రధాన కారణమన్నారు. చెయ్యేరు నది మీద అన్నమయ్య డ్యాం కొట్టుపోయేంత వరద వచ్చినా కనీసం గత ప్రభుత్వం స్పందించలేదన్నారు. చుట్టుపక్కల గ్రామాల వారిని అప్రమత్తం చేయలేదు. అన్నమయ్య డ్యాం లష్కర్ రామయ్య వేలాది మందిని అప్రమత్తం చేసి కాపాడారన్నారు. అప్పుడు కూడా గత ప్రభుత్వం స్పందించకపోవడం కచ్చితంగా మానవ తప్పిదమన్నారు. అయితే ప్రస్తుత వరదలు పూర్తిగా ప్రకృతి విపత్తు అని స్పష్టం చేశారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పంచాయతీ సిబ్బందికి ప్రత్యేక విధులు..
వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు పర్యటిస్తూ బాధితులకు ధైర్యం చెబుతున్నారు. యంత్రాంగాన్ని పర్యవేక్షిస్తున్నారు. నేషనల్ డిజాస్టర్ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్, నేవీతోపాటు రాష్ట్ర ప్రభుత్వ శాఖలన్నీ సమష్టిగా బాధితుల కోసం పని చేస్తున్నాయి. అనుకోని వరదల వల్ల మొత్తం ఆరు జిల్లాలపై ప్రభావం పడింది. ఎక్కువగా ఎన్టీఆర్ జిల్లాపై అధిక ప్రభావం పడింది. వరదల వల్ల 29 మంది మృతి చెందితే, ఇద్దరు గల్లంతయ్యారు. 200 పశువులు, 59,848 కోళ్లు మృత్యువాతపడ్డాయి. పశువులకు సైతం 131 హెల్త్ క్యాంపులు నిర్వహించి 8,741 పశువులకు వైద్యం అందించాం. 60 పడవలు దెబ్బతిన్నాయి. పంచాయతీరాజ్ పరిధిలో 233 కిలోమీటర్ల మేర రోడ్లు పాడయ్యాయి. 40 రోడ్డు బ్రిడ్జిలు తెగిపోతే, దీనిలో 11 పునరుద్ధరించాం. 41 కల్వర్టులు నాశనం అయితే ఒక కల్వర్టు పునరుద్ధరించాం. 11 సహాయక శిబిరాలు కూడా పాడయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్ తరఫున 26 బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ తరఫున 22 బృందాలు, నేవీ నుంచి రెండు బృందాలు సేవలు అందిస్తున్నాయి. నిత్యావసర వస్తువులు, మెడికల్ కిట్లు డ్రోన్ల ద్వారా అందిస్తున్నాయి.
సుమారుగా 386 పంచాయతీలు పూర్తిగా వరదల్లో మునిగిపోయాయి. పంచాయతీ రోడ్లను మెరుగుపర్చేందుకు వెంటనే పనులు చేసేందుకు రూ.2.15 కోట్లు, శాశ్వతంగా పనులు చేసేందుకు రూ.94 కోట్లు ప్రతిపాదనలు వచ్చాయి. వరద అనంతరం శానిటేషన్ మెరుగుదలకు, రక్షిత మంచినీరు అందించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం. 175 బృందాలు విజయవాడ అర్బన్ లో శానిటేషన్ పనులు చేస్తాయి. ఒక్కో బృందంలో ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ఇతర నిపుణులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. వరదలు లేని జిల్లాల్లో 688 మందిని పారిశుద్ధ్యం మెరుగుదలకు తీసుకువస్తున్నాం. వరదల అనంతరం తాగునీటి వలనె వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో సూపర్ క్లోరినేషన్ చేసి తాగునీరు అందించనున్నాం. శక్తివంచన లేకుండా పని చేసిన పారిశుద్ధ్య కార్మికులను గౌరవించుకునే బాధ్యత నేను తీసుకుంటాను.
ఒక్కో పంచాయతీకి రూ. లక్ష విరాళం.. తెలంగాణకు రూ. కోటి విరాళం
అనుకోని వరదల వేళ నష్టపోయిన వారిని ఆదుకునేందుకు సీఎం సహాయ నిధికి ఇప్పటికే రూ. కోటి విరాళం ప్రకటించాను. అయితే పరిస్థితిని సమీక్షించిన తర్వాత చేసిన సహాయం తక్కువ అనిపించింది. దీంతో వ్యక్తిగతంగా మరోసారి వరదల వల్ల నష్టపోయిన 400 పంచాయతీలకు ప్రతి పంచాయతీకి రూ. లక్ష చొప్పున నా వ్యక్తిగత సహాయం అందిస్తా. ఇవి నేరుగా పంచాయతీల ఖాతాల్లో చేరేలా చర్యలు తీసుకుంటాను. ఈ డబ్బుతో ఆయా పంచాయతీలు వరద నుంచి కోలుకోవడానికి అవసరం అయిన పనులను చేసుకోవడానికి వీలుంటుంది. దీంతో పాటు తెలంగాణ సైతం వర్షాలకు దెబ్బతింది. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసి అందజేస్తాను.
ప్రస్తుతం అంతా విపత్తు వేళ విరాళాల ద్వారా తగిన విధంగా స్పందిస్తున్నారు. విరాళం ఇస్తే పారదర్శకంగా వ్యయం చేసి సాయం పక్కాగా అందుతుంది అనే విశ్వాసం కలిగితే కచ్చితంగా స్పందిస్తారు. నేను పంచాయతీలకు వ్యక్తిగతంగా ఇస్తున్న రూ. 4 కోట్లతో ఎలాంటి పనులు పారదర్శకంగా చేస్తారో పరిశీలిస్తాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాలా అభయ హస్తం ఇచ్చి అండగా నిలుస్తోంది. పెండింగ్ లేకుండా నిధులను అందజేస్తోంది. రాష్ట్రంలో దారుణమైన ఆర్ధిక పరిస్థితుల మీద ఇటీవల శ్వేతపత్రాలు విడుదల చేశాం. అనుకోని విపత్తు వేళ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు బాధితులని ఆదుకునేందుకు ముందుకు రావాలి.
ఆక్రమణల తర్వాత ధ్వంసం కంటే… ముందుగా గుర్తించే వ్యవస్థ ఉండాలి
కేంద్ర అటవీశాఖ ఆధ్వర్యంలో అడవులపై పూర్తి స్థాయి పర్యవేక్షణ వ్యవస్థ ఉంటుంది. ఏ మాత్రం అడవుల్లో చిన్న అతిక్రమణ జరిగినా శాటిలైట్ చిత్రాల ద్వారా వాటిని నిమిషాల్లో గుర్తించే సాంకేతికత వారి దగ్గర ఉంది. అలాంటి సాంకేతికత నదీ పరివాహక ప్రాంతాలు, వాగులు, వంకలు, చెరువులను ఆక్రమించే వారిపైనా ఉంటేనే ఎప్పటికప్పుడు ఆక్రమణలను గుర్తించవచ్చు. విపత్తుల నుంచి రక్షించుకోగలం. ఒక అక్రమ నిర్మాణాన్ని ధ్వంసం చేసే కంటే.. దాన్ని నిర్మించక ముందే అడ్డుకోవడం ఉత్తమ మార్గం. ఒక నిర్మాణాన్ని లేదా నివాసాన్ని తొలగించాలంటే సామాజిక పరిస్థితులు, న్యాయపరమైన అడ్డంకులు బోలెడు ఉంటాయి. వాటన్నింటినీ సరైన చర్చల ద్వారా, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా మాత్రమే అధిగమించవచ్చు. హైదరాబాద్ లో హైడ్రా చేస్తున్న పని సరైనదే. అయితే ఏ ప్రభుత్వం అయినా ముందుగా నిర్మాణాలు జరగకుండా అడ్డుకోవాలి. గత ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు నివాస కాలనీలు కట్టబెట్టింది. అంటే వరదలతో మునిగిపోయే ప్రాంతాలను ఎంపిక చేసి ప్రజలకు నివాసాలు కేటాయించడం ఎలాంటి చర్యో అర్ధం అవుతుంది. క్షేత్ర స్థాయిలో పంచాయతీ లేఅవుట్లు వేసినప్పుడే దాన్ని అడ్డుకుంటే మొదట్లోనే అక్రమ నిర్మాణాలను అడ్డుకోవచ్చు.
ఏలేరు వరదపై అప్రమత్తం చేశాము ..కృష్ణా నదిలో వరద క్రమంగా తగ్గుతోంది.
బుధవారం నాటికి 3.05 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది. అయితే గోదావరి వైపు క్రమంగా వరద పెరుగుతున్న దృష్ట్యా కాకినాడ కలెక్టర్ ను అప్రమత్తం చేశాం. పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు జలాశయానికి వరద ముప్పు ఉంది. ఇప్పటికే 20.2 టి.ఏం.సి.ల నీరు వచ్చింది. ఈ సాయంత్రానికి కొంత మేర నీళ్ళు కిందకు వదులుతారు. ప్రభావిత ప్రాంతాలను ఇప్పటికే అప్రమత్తం చేశాం. పిఠాపురం నియోజకవర్గ వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలకు శాశ్వత ప్రత్యామ్నాయం, పరిష్కారం చూపేలా ప్రయత్నాలు చేస్తున్నాం. రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరు ఆలోచించి ఈ విపత్తు వేళ సాయం అందించేందుకు ముందుకు రావాలి’’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.