Breaking News

వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం

-మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి బాధితులకు భరోసానిచ్చారు. సోమవారం సుమారు మూడు గంటల పాటు వరద ప్రభావిత ప్రాంతాలు అయిన జక్కంపూడి కాలనీ, చిట్టి నగర్, సితారా సెంటర్ ప్రాంతాల్లో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిలు విస్తృతంగా పర్యటించారు. మోకాళ్ల లోతు నీటిలో మంత్రులు ఇరువురు కలిసి బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులు ప్రధానంగా విద్యుత్, నీటి సరఫరా లాంటి సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకుని వచ్చారు. వరద నీరు ఎక్కువగా ఉండడం కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్ ను నిలిపి వేసినట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. జక్కంపూడి కాలనీ లోని ప్రతీ బ్లాక్ కు విద్యుత్ ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం రాత్రికి పూర్తి స్థాయిలో విద్యుత్ ను పునరుద్ధరించనున్నట్లు అధికారులు మంత్రులకు వివరించారు.

మంత్రులు రవి కుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామిలు ముంపు బాధితులకు భోజనం, తాగునీరు, పాలు ఎలా అందుతున్నాయో అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. గతంలో ఎన్నాడూ విజయవాడ ఈ రకంగా ముంపునకు గురికావడం చూడలేదని అన్నారు. ముంపు బారిన పడిన ప్రతి ఒక్కరిని రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకుంటుందని మంత్రులు పేర్కొన్నారు.

మరో వైపు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్థానికంగా విద్యుత్ అధికారులు చేపడుతున్న పునరుద్ధరణ పనులను పరిశీలించారు. జక్కంపూడి కాలనీలోని సబ్ స్టేషన్ దగ్గరకు వెళ్లి మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విద్యుత్ పునరుద్ధరణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో ఉన్న మొత్తం వెయ్యి సర్వీసులకు పూర్తి స్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ జరుగుతుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే కాలనీలో కొన్ని బ్లాక్ లకు విద్యుత్ ను అందించినట్లు బాధితులు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడంపై మంత్రులకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. వరద నీరు కారణంగా విద్యుత్ పునరుద్ధరణ పనులకు ఆటంకం కలిగిందని, అయినా వాటిని అధిగమించి పురుద్ధరణ పనులు పూర్తి చేశామని అధికారులు వివరించారు.

ఈ క్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. కాలనీలోని బాధితులందరికి బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందిస్తామని తెలిపారు. నీటి ప్రవాహం అదుపులోకి వచ్చిన తరువాత కాలనీ మొత్తం శానిటేషన్ చేయిస్తామని హామి ఇచ్చారు. పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు, బైక్ లకు ఆయా కంపెనీలతో మాట్లాడి రిపేరు చేయిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *