– వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాల పరిశీలన
– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్ట అంచనాకు కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో కేంద్ర బృందం గురువారం ఎన్‌టీఆర్ జిల్లాలో పర్యటించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన తెలిపారు. కలెక్టర్ సృజన బుధవారం కలెక్టరేట్‌లో కేంద్ర బృందం పర్యటనకు చేయాల్సిన ఏర్పాట్లపై ఇరిగేషన్, మునిసిపల్, ఆర్ అండ్ బీ, గ్రామీణ నీటిసరఫరా, వ్యవసాయం, ఉద్యాన, విద్యుత్ తదితర శాఖల అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్‌కు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ విజయవాడ, పరిసర ప్రాంతాలతో పాటు జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా తలెత్తిన నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కేంద్రం బృందం గురువారం జిల్లాలో పర్యటించనుందని తెలిపారు. ఈ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. చిత్రప్రదర్శనతో పాటు క్షేత్రస్థాయి సందర్శనకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రకాశంబ్యారేజ్‌కు జరిగిన నష్టం, బుడమేరు డైవర్షన్ ఛానల్ (బీడీసీ)కి పడిన గండ్లు, వాటిని పూడ్చేందుకు తీసుకున్న చర్యలు తదితరాలతో పాటు ఇబ్రహీంపట్నం, రాయనపాడు తదితర ప్రాంతాల్లో వ్యవసాయానికి జరిగిన నష్టం, జక్కంపూడి, సింగ్‌నగర్ తదితర ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటిస్తుందని వివరించారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ రహదారులు తదితరాలకు జరిగిన నష్టాన్ని కూడా కేంద్రబృందం పరిశీలించనున్నట్లు తెలిపారు. నష్ట అంచనాలనూ పూర్తిస్థాయిలో కేంద్రానికి నివేదించే విధంగా డాక్యుమెంటేషన్‌ను కూడా బృందానికి అందించనున్నట్లు కలెక్టర్ సృజన తెలిపారు.