-మూడు రోజుల పాటు జరిగే సదస్సును ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
-రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్ పై రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలపై సమ్మిట్ లో సిఎం చంద్రబాబు ప్రజెంటేషన్
-ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ (ICE) పాలసీ-2024ను తీసుకువస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
-2030 నాటికి APలో 72.60 GW పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి లక్ష్యం..గ్రీన్ ఎనర్జీ గేమ్ ఛేంజర్ అవుతుంది.
-గ్రీన్ ఎనర్జీ విప్లవం రాబోతోంది….గ్రీన్ ఎనర్జీ విప్లవానికి భారతదేశం నాయకత్వం వహించాలి
-క్లీన్ ఎనర్జీ కోసం గ్లోబల్ యూనివర్శిటీని ఏపీలో ఏర్పాటు చేస్తాం:- గుజరాత్ సమ్మిట్ లో సిఎం చంద్రబాబాబు నాయడు
గాంధీనగర్, నేటి పత్రిక ప్రజావార్త :
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన 4వ గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్ పై రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు, పెట్టుబడులకు ఆహ్వానంపై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వం తీసుకువచ్చే నూతన విధానాల గురించి పారిశ్రామిక వేత్తలకు వివరించారు. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు. ఈ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ….‘‘2030 నాటికి 72.60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉంది. అదే సంవత్సరం నాటికి మన దేశం 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సాధిస్తుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడం వల్ల ఉద్యోగ, ఉపాధి కల్పన, తక్కువ ధరకే విద్యుత్ అందుబాటులోకి రావడం, పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తుంది. సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ అండ్ గ్రీన్ హైడ్రోజన్‌లో రాష్ట్రం విస్తారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్‌తో పాటు పన్ను మినహాయింపులు, రాయితీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సులభమైన నిబంధనలతో ఏపీ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంది. ఈ అనుకూల వాతావరణాన్ని ప్రపంచస్థాయి పెట్టుబడిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను’’ అని ముఖ్యమంత్రి అన్నారు.
‘‘పునరుత్పాదక ఇంధనంలో ప్రపంచ అత్యుత్తమ పద్ధతులను అవలంబించడం, ఆర్ అండ్ డి, సాంకేతికతను వినియోగించుకోవడం, నాలెడ్జ్ ను షేర్ చేసుకోవడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి క్లీన్ ఎనర్జీ, సర్క్యులర్ ఎకానమీ కోసం గ్లోబల్ యూనివర్శిటీని రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్రంలో 40 GW సౌరశక్తి, 20 GW పవన శక్తి, 12 GW పంప్‌డ్ స్టోరేజ్, 25 GW బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, 1 MTPA గ్రీన్ హైడ్రోజన్ , డెరివేటివ్స్, 2500 KLPD బయో ఫ్యూయల్స్‌తో పునరుత్పాదక ఇంధన సామర్థ్య లక్ష్యాలను రాష్ట్రం నిర్దేశించుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం 500 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎపీలో ఇప్పటి వరకు 4335.28 మెగావాట్ల సోలార్, 4083.57 మెగావాట్ల పవన విద్యుత్, 443 మెగావాట్ల బయో ఎనర్జీ, 36 మెగావాట్ల వేస్ట్ టు ఎనర్జీ ఉత్పత్తి ఉంది. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో దాదాపు 4,000 మెగావాట్ల సోలార్ పవర్ పార్కులను ఏర్పాటు చేశాం. ప్రకాశం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లాలో మరో 2,700 మెగావాట్ల సోలార్ సామర్థ్యం పార్కులు రానున్నాయి’’ అని సీఎం తెలిపారు.
‘‘ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా ఏపీలో 10 లక్షల ఇళ్లలో రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి ని లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే ప్రభుత్వ భవనాలను కూడా సోలార్ విద్యుత్ కేంద్రాలుగా మారుస్తాం. గతంలో పీపీపీ విధానం అమలు చేశాం. ఇప్పుడు పీ4 విధానాన్ని పరిచయం చేస్తున్నాను. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టనర్‌షిప్. పునరుత్పాదక శక్తిలో ప్రజలను భాగస్వాములుగా చేర్చాలని నేను కోరుకుంటున్నాను. రాష్ట్రంలో కొత్తగా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ను తీసుకువస్తాం. ఈ పాలసీ ముసాయిదా కింద ప్రతిపాదించబడిన ప్రోత్సాహకాలను వివరిస్తూ, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది’’ అని ముఖ్యమంత్రి అన్నారు.
‘ప్రభుత్వం పవన విద్యుత్ ప్రాజెక్టులు, టర్బైన్ తయారీదారుల అభివృద్ధికి కీలకమైన ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఆర్ఈ పరికరాల తయారీకి, ఆర్ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ట్రాన్స్‌మిషన్, వీలింగ్ ఛార్జీలను మాఫీ చేస్తుంది. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి వాటికి వడ్డీ రాయితీలను అందిస్తుంది. ఆర్ఈ పరికరాల తయారీదారులకు ఉత్పత్తి ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. తదుపరి విప్లవం గ్రీన్ ఎనర్జీ విప్లవం. దీన్ని భారత దేశం అందిపుచ్చుకోవాలి’’ అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
అనంతపురంలో సోలార్ పార్కుల ఏర్పాటుకు గాను ఆంధ్రప్రదేశ్ తరపున ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ కె.విజయానంద్ కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి నుండి అవార్డును అందుకున్నారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఇతర ఇంధన శాఖ అధికారులు పాల్గొన్నారు. సదస్సుకు వచ్చిన జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. రెన్యువబుల్ ఎనర్జీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు పారిశ్రామిక వేత్తలకు వివరించి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.