ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త :
పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. శుక్రవారం మద్దిరాలపాడు వచ్చిన ఆయన గ్రామంలోని పేదల ఇళ్లకు వెళ్లి వారి జీవన స్థితిగతులను పరిశీలించి, ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. ఈ క్రమంలో ఖాజావళి, పటాన్ బీబీ సారా దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లారు. గత టి.డి.పి. ప్రభుత్వ హయాంలో 2016-17 సంవత్సరంలో ఎన్.టి.ఆర్. హౌసింగ్ పధకంలో తమకు పక్కా ఇల్లు మంజూరైనదని వారు తెలిపారు. అప్పట్లో రూ.84,850 ల బిల్లును ప్రభుత్వం తమకు చెల్లించిందని, ఆ తరువాత ప్రభుత్వం మారడంతో బిల్లు పూర్తి స్థాయిలో తమకు రాలేదని వారు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ రూ.65,150 లు చెక్కును ఆ కుటుంబ సభ్యులకు అందించారు.
అదే విధంగా అల్లుదాసు శ్రీను, రేణుక దంపతుల ఇంటికి కూడా ముఖ్యమంత్రి వెళ్లారు. తమకు స్వంత ఇల్లు లేదని, స్వంత స్థలం కూడా లేదని వారు ముఖ్యమంత్రికి చెప్పారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అభ్యర్థించారు. తమ బిడ్డలు ఉన్నత చదువులు చదివేలా సహాయం చేయాలని వారు చంద్రబాబును కోరారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న వారికి ఇళ్లు నిర్మించడానికి అవసరమైన 200 ప్లాట్లు ఉండేలా స్థలం సేకరించాలని అధికారులను ఆదేశించారు.